నిషేధిత గుట్కాతో పాటు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్ధాల రవాణాపై జంట నగరాల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీటి అమ్మకాలు, వినియోగం, రవాణాను అరికట్టాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు చేపడుతున్నారు. మత్తు పదార్ధాలు, నిషేధిత గుట్కా, గంజాయిని పూర్తిగా నిరోధించేలా కృషి చేస్తున్నారు. నిఘా పెంచి పాన్‌షాపులపై కేసులు నమోదు చేసి, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. మత్తు పదార్ధాల వలన కలిగే అనర్ధాల గురించి విద్యార్ధుల్లో అవగాహన కల్పిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలు
యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్న గంజాయి, గుట్కా లాంటి మత్తు పదార్ధాల విక్రయానికి అడ్డుకట్ట వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక రచించాలని.. ఉత్తమంగా పనిచేసే సిబ్బందికి రివార్డులు కూడా అందించాలని ఉన్నతాధికారులు సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని వెల్లడించారు.
మూడు కమిషనరేట్లపై ప్రత్యేక నిఘా
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని పాన్‌షాపులు, కిరాణా దుకాణాలతో పాటు ఇతరత్రా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్సైజ్, పోలీసు అధికారులు, సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలతో పాటు నగరంలోనూ ప్రతి రోజు దాడులు జరుగుతున్నాయి. రాజధాని సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కాలినడకన తిరుగుతూ ధూల్ పేట్ వంటి ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గతంలో గంజాయి విక్రయించి అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి రవాణ అవుతున్నందున దాన్ని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.