హైదరాబాద్ పంజాగుట్టలో హత్యకు గురైన వ్యాపారి రాంప్రసాద్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య చేసేందుకు కిరాయి ముఠాకు కోటి రూపాయల సుపారీ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రధారి కోగంటి సత్యం... హత్య జరిగినప్పుడు చుట్టుపక్కనే ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇప్పటికే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు, మిగతా ముగ్గురు కోసం గాలిస్తున్నారు.
హత్యకు రెండు నెలల రెక్కీ..
వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన విభేదాల వల్ల రాంప్రసాద్‌ను కోగంటి సత్యం హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో కోగంటి సత్యం, శ్యామ్, రమేశ్, చోటూను రెండు రోజులుగా ప్రశ్నిస్తున్న పోలీసులు.. వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఆంజనేయ ప్రసాద్, నరేశ్‌లను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరి పర్యవేక్షణలోనే హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
కోగంటి సత్యం, ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత కలిసి కామాక్షి స్టీల్ పేరుతో కంపెనీ స్థాపించారు. స్థానికంగా కార్మిక నేతగా గుర్తింపున్న కోగంటి సత్యం పలు వివాదాల్లో జోక్యం చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. కోగంటి సత్యంతో విభేదాలు వచ్చి తన వాటాను రాంప్రసాద్‌కు విక్రయించాడు సదరు రాజకీయ నాయకుడు. కొన్నాళ్లపాటు రాంప్రసాద్, కోగంటి సత్యం ఉమ్మడిగా వ్యాపారం నిర్వహించారు. అనంతరం వ్యాపారంలో 70 కోట్ల నష్టం వచ్చినట్లు రాంప్రసాద్ లెక్కలు చూపించటం వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.