సాగరతీరంలో ఆకట్టుకున్న పోలీసుల విన్యాసాలు రాష్ట్ర పోలీసు శాఖలోని 4 బెటాలియన్లకు పోలీసు బ్యాండ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా సంగీత వాద్యాలతో ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు హుస్సేన్ సాగర తీరంలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గుస్సాడీ, బంజారా నృత్యం, మల్లయోధుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెటాలియన్స్ కార్యక్రమాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి వీక్షించారు. త్రివర్ణ పతాకాలు చేతబూని తుపాకులతో చేసిన విన్యాసాలు అదరహో అనిపించాయి. నృత్యాలు చేస్తూనే డయల్ 100 ఆకారంలో తుపాకులను అమర్చే ప్రదర్శనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శం
రాష్ట్ర పోలీసు శాఖ దేశానికే ఆదర్శమని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. పోలీసు శాఖకు పుష్కలంగా నిధులిచ్చామని.. మహిళల్లో పోలీసులు భరోసా కల్పిస్తున్నారన్నారు. చెరువులో కారు మునిగి కొట్టుకుపోతున్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుళ్లు పవన్, శ్రీనివాస్‌లకు జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర వేడుకలు, రాష్ట్రపతి పర్యటన సమయాల్లో, పరేడ్స్‌లో ఈ పోలీసు బ్యాండ్ అందుబాటులో ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
వికసించిన పుష్పం ఆకారంలో మల్లయోధుల ప్రదర్శనకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. సాహసాలు ప్రదర్శించి ప్రజల రక్షణలో ప్రాణాలైనా లెక్కచేయమంటూ పోలీసుల గీతాలాపన అందర్నీ కదిలించింది.
ఇవీ చూడండి: కారు ఫుల్ అయింది .. లొల్లీ మొదలైంది!