Terrorist conspiracy foiled in Hyderabad: హైదరాబాద్‌లో పేలుళ్ల ద్వారా విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైన ముగ్గురిని నగర పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ముగ్గురి కదలికలపై డేగ కన్ను వేశారు. నిందితులకు ఏ మాత్రం అనుమానం వచ్చినా వారు పరారయ్యే అవకాశం ఉండడంతో.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అరెస్టు చేశారు.
ఇటీవల నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలను అవకాశంగా చేసుకుని మతఘర్షణలు రెచ్చగొట్టేందుకు మూసారాంబాగ్‌కు చెందిన జాహెద్‌కు పాకిస్థాన్ నుంచి ఆదేశాలు అందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను కూడా ఇందుకోసం ఇతను వాడుకుంటున్నట్టు భావిస్తున్నారు. హిందూ పండుగలు, భాజపా, ఆర్ఎస్ఎస్ బహిరంగ సభలు లక్ష్యంగా బాంబు పేలుళ్లతో విధ్వంసం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాన్ని అమలు చేసేందుకు దసరా పండుగను అవకాశంగా మలచుకోవాలనుకున్నారు.
నీలిరంగు గ్రనేడ్లతో దాడులతో దాడికి యత్నం: భారీ ఎత్తున పేలుళ్ల కోసం బాంబు తయారీకి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేవారు. అవతలి వైపు నుంచి ఇంటర్‌నెట్, ఫోన్ ద్వారా తయారీపై సూచనలు చేసేవారు. పోలీసు నిఘా పెరగడం, తయారీలో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో దాడులకు గ్రనేడ్లను వినియోగించాలనుకున్నారు. ఇటీవల కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు నీలిరంగు గ్రనేడ్లతో దాడులు చేశారు. ఆ గ్రనేడ్లు చైనాలో తయారైనట్టు బయటపడింది. రెండు నెలల క్రితం అవే గ్రనేడ్లు పాకిస్థాన్ నుంచి కశ్మీర్ చేరాయి.