GHMC BJP Corporators Arrest: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం బుధవారం గందర గోళం, ఉద్యోగుల వాకౌట్, ఆ తరవాత సభ నిరావధిక వాయిదా వేయడం, బీజేపీ కార్పొరేటర్ల అరెస్టుతో ఉద్రిక్తతల మధ్య నడిచింది. సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ కౌన్సిల్ హాల్‌లో బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సభ వాయిదా అనంతరం హాల్‌లోనే కార్పొరేటర్లు బైఠాయించగా హాల్‌లో విద్యుత్ సరాఫరాను జీహెచ్ఎంసీ సిబ్బంది నిలిపివేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వారు ప్రతిఘటించగా.. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
"కౌన్సిల్ సమావేశం తూతుమంత్రంగా నిర్వహించారు. మాకు జీహెచ్‌ఎంసీ అధికారులకు మధ్య గొడవలు సృష్టించి మేయర్ గారు మాయమయ్యారు. సుమారు 30లక్షల రూపాయాలు ఖర్చు పెట్టి కేవలం 15నిమిషాలలోనే సభను నిర్వహించి వాయిదా వేశారు. ప్రశ్నించిన వారిని ఈ ప్రభుత్వం అరెస్టు చేయాలని చూస్తోంది. ఈరోజు వాయిదా వేసిన సభను మరల ఎప్పుడు పెడతారో వెంటనే ప్రకటించాలి."- బీజేపీ కార్పొరేటర్
GHMC corporators meeting: జీహెచ్‌ఎంసీ అధికారుల వాకౌట్ చేయడంపై తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత తాజాగా స్పందించారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. లేని పక్షంలో అధికారులుగా సహకరించమని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్లు అధికారుల పట్ల అనుచిత ధోరణికి నిరసనగా కౌన్సిల్ సమావేశం బై కాట్ చేసినట్లు ప్రకటించారు. మంగళవారం జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు అధికారులతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు.
కార్యాలయంలో సిల్ట్ వేయడం.. అధికారులపై అనుచితంగా మాట్లాడటంపై జీహెచ్ఎంసీ అధికారులు ఖండిస్తున్నట్లు తెలిపారు. జలమండలి అధికారులు మద్దతుగా కౌన్సిల్ సమావేశం బైకాట్ చేస్తున్నట్లు గుర్తు చేశారు. కార్పొరేటర్ల సమస్యలను సర్కిల్ నుంచి జోనల్ వరకు అధికారులు సమస్యలను విని సామరస్యంగా పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.