Food Adulteration In Hyderabad : సమాజంలో అక్రమ కల్తీ వ్యాపారాలు అధికమైపోయాయి. అనుమతులు లేకుండా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఇష్టారీతిన వ్యాపారాలు చేస్తున్నారు. హానికర పదార్థాలు తయారు చేసి ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాలు చేసుకుంటూ పదార్థాలను విక్రయిస్తున్నారు. కనీస శుభ్రత ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన తినే పదార్థాలను తయారు చేస్తున్నారు. ఎలాంటి టెస్టింగ్ లేని, కనీసం శుభ్రత కూడా లేని పదార్థాలను అనుమతులు లేకుండా విక్రయిస్తున్నారు. పదార్థాల్లో ముప్పు కలిగించే కెమికల్స్‌ను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. వాటిని చూస్తేనే అసహ్యం కలిగే రీతిలో అక్రమార్కులు ఆహార పదార్థాల కల్తీకి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో తాజాగా బయటపడింది.
పోలీసుల దాడి: కల్తీ పదార్థాలను తయారు చేస్తున్న కార్ఖానాపై సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు జరుపగా జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఉమ్మానీ ఫుడ్ కంపెనీ నకిలీ, కల్తీ పదార్థాలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నట్లు సైబరాబాద్ కమిషనరేట్‌కు సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే కమిషనర్ ఆదేశాల మేరకు మైలార్‌దేవుపల్లి, శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు శనివారం రాత్రి కార్ఖానాపై దాడులు నిర్వహించారు. అక్కడ ప్రాణాలకు ముప్పు కలిగించే, అనారోగ్యకరమైన పదార్థాలతో తయారైన మ్యాంగో జూస్, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఫుడ్ మసాలాలను పోలీసులు గుర్తించారు. ఇవేగాక మరెన్నో ఆహర పదార్థాలను రసాయనాలు కలిపి ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు.