PETBASHEERABAD MURDER CASE UPDATE: హైదరాబాద్ శివారు ప్రాంతం దూలపల్లిలో జరిగిన పరువుహత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించిన యువతి సోదరుడు దీన్దయాల్నే ప్రధాన నిందితునిగా దర్యాప్తులో పేర్కొన్నారు. దేవరకొండ హరీశ్ బావ మరిదితో పాటు.. యువతి సోదరుడికి సహకరించిన మరో పది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్య కేసులో పోలీసులు పలు విషయాలను రిపోర్టులో పేర్కొన్నారు.
అసలేం జరిగింది:రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా సూరారంలో నివాసం ఉంటున్న హరీశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఓ మహిళతో పాటు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి కత్తులతో దారుణంగా నరికి చంపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును వేగంగా చేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావించి.. ఆ కోణంలో విచారణను ముమ్మరం చేశారు.
పోలీసులు విచారిస్తున్న సమయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో హరీశ్ అమీర్‌పేట్‌లోని ఎల్లారెడ్డిగూడెంలో ఉంటున్నప్పుడు.. అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించినట్లు స్థానికులు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో తన చెల్లి వెంట పడొద్దంటూ యువతి సోదరుడు హరీశ్‌ను హెచ్చరించినట్లు తెలుసుకున్నారు. దీంతో హరీశ్ కుటుంబం 6 నెలల క్రితం దూలపల్లిలోని సూరారం కాలనీకి మకాం మార్చారు.