గోదావరి నీటిని స్పిల్ వే లోకి మళ్లించే అప్రోచ్ ఛానల్‌ను ప్రారంభంలో 600 మీటర్ల వరకు ఏర్పాటు చేయాలని పోలవరం డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్‌పీ) సూచించింది. స్పిల్ వేకు ఎగువన ఎడమ వైపున 500 మీటర్ల మేర గైడ్ వాల్ నిర్మాణానికి దాదాపు పచ్చజెండా ఊపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మంగళవారం 17వ డీడీఆర్‌పీ వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్యానెల్ ఛైర్మన్ ఏబి పాండ్యా, ఇతర నిపుణులు హండా, మునిలాల్, దత్తా, శ్రీవాస్తవలతో పాటు పోలవరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, సలహాదారు గిరిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టులో ప్రధాన రాతి మట్టి కట్ట నిర్మించాల్సిన చోట ఎగువన గోదావరి గర్భం కోతపై కూడా చర్చించారు. తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ జానకిరామయ్య ఇందుకు సంబంధించి ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. కోత ప్రాంతంలో పూర్తిగా ఇసుకతో నింపి పూర్తిగా ఒదిగిపోయేలా చేసి అంతా సహజ స్థాయికి సర్దుకున్న తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణం చేపట్టాలని ప్యానెల్ సూచించింది.