తెలంగాణ

telangana

ETV Bharat / state

PMEGP Scheme: ఏడాదికి వెయ్యి మందికీ ప్రయోజనం చేకూర్చని పీఎంఈజీపీ పథకం - Telangana news

PMEGP Scheme: ప్రైమ్‌ మినిస్టర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం-పీఎంఈజీపీలో రాష్ట్ర పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. వడపోత పేరిట అధికారులు పెద్దఎత్తున దరఖాస్తులు తిరస్కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

PMEGP Scheme
PMEGP Scheme

By

Published : Mar 19, 2022, 6:04 AM IST

PMEGP Scheme: నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉపాధికి ఆసరా అయ్యేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (ప్రైమ్‌ మినిస్టర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం-పీఎంఈజీపీ)లో రాష్ట్ర పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. వడపోత పేరిట అధికారులు పెద్దఎత్తున దరఖాస్తులు తిరస్కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాదికి లక్ష దరఖాస్తులు వస్తుంటే లబ్ధిదారుల సంఖ్య 500-700 లోపే. వీరికి సైతం రుణాలివ్వడానికి బ్యాంకులు మోకాలడ్డుతున్నాయి. ఏడాదికి కనీసం వేయి మందికైనా లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది.

సగటున ఒక జిల్లాకు 16 మంది వరకే సాయం..

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం 18 ఏళ్లు దాటిన వారికి తయారీ రంగంలో రూ.25 లక్షలు, సేవా రంగంలో రూ.10 లక్షల చొప్పున పీఎంఈజీపీ పథకం కింద బ్యాంకుల ద్వారా రుణసాయం అందుతుంది. కేంద్రం 2008లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని కింద జనరల్‌ కేటగిరి వారు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, మహిళ, మాజీ సైనికులు, దివ్యాంగులు, పర్వత ప్రాంతాల వారు అయిదు శాతం తమ వాటాగా చెల్లించాలి. పట్టణ ప్రాంతాల్లోని జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు 15 శాతం, ప్రత్యేక కేటగిరి వారికి 25 శాతం రాయితీని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో జనరల్‌ కేటగిరి వారికి 25 శాతం, ప్రత్యేక కేటగిరి వారికి 35 శాతం రాయితీ ఇస్తారు. మొదట్లో రూ.5-10 లక్షల విలువైన ప్రాజెక్టులే ఉండగా ఆ తర్వాత క్రమేపీ విలువను పొడిగించారు. దీనికి అనుగుణంగా దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. సాయం అరకొరగానే అందుతోంది. 2021-22లో కేవలం 519 మందికే రుణాలిచ్చారు. 2016లో రాష్ట్రంలోని జిల్లాలు 10 నుంచి 33కి పెరిగాయి. సాయాన్ని మూడు రెట్లు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినా స్పందన లేదు. వేయి మందికి రుణసాయ లక్ష్యాన్ని ఏ సంవత్సరం సాధించలేదు. 33 జిల్లాల్లో సగటున ఒక జిల్లాకు 16 మంది వరకే సాయం అందింది.

చేతులెత్తేస్తున్న బ్యాంకులు

మొత్తంగా రాష్ట్ర స్థాయిలో 90 వేల వరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. మిగిలిన పదివేలను జిల్లాల వారీగా రుణసాయం అందించేందుకు బ్యాంకులకు పంపిస్తున్నారు. వాటిని బ్యాంకులు వెంటనే ఆమోదించకుండా తిరిగి పరిశీలనలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఆర్థిక స్థితిని చూసి కొంత మందికే సాయం చేస్తున్నాయి. బ్యాంకులకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసి అభ్యర్థులు వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఒక సంవత్సరం తిరస్కరించిన దరఖాస్తులను ఈ పథకంలో మళ్లీ పరిగణనలోనికి తీసుకోవడం లేదు. మరుసటి యేడాది మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే.

ప్రాథమిక దశలోనే తిరస్కరణ..

హైదరాబాద్‌ బాలానగర్‌కు చెందిన చంద్రశేఖర్‌, సురేశ్‌లు ఐటీఐ పూర్తి చేశారు. బాలానగర్‌, గాంధీనగర్‌లలో వివిధ కంపెనీల్లో పని చేశారు. సొంతంగా లేత్‌ మిషన్‌ ఏర్పాటు చేసుకొని తమ కాళ్ల మీద తాము నిలబడాలని పీఎంఈజీపీ కింద దరఖాస్తు చేసుకున్నారు. వారికి బ్యాంకుల నుంచి పిలుపే రాలేదు. ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక దశలోనే ద]రఖాస్తు తిరస్కరణకు గురైందని తెలపడంతో వారు నిరాశకు గురయ్యారు.

ప్రదక్షిణలు తప్పడం లేదు..

డిగ్రీలో బీటెక్‌ పూర్తి చేసి సొంతంగా చిన్న పరిశ్రమ కోసం పీఎంఈజీపీలో వరుసగా మూడేళ్లుగా ప్రాజెక్టు రిపోర్ట్‌తో దరఖాస్తు చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. బ్యాంకు అధికారులను అడిగితే సమాధానం లేదు. పథకం పేరిట నిరుద్యోగులను ఊరిస్తున్నారే తప్ప సాయం అందడం లేదు.
- సాగర్‌, హైదరాబాద్‌

ఇవ్వలేమంటున్నారు..

జిరాక్స్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం పీఎంఈజీపీలో దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకుల చుట్టూ ఎనిమిది నెలలుగా తిరుగుతున్నాను. రుణం మంజూరు చేయడం లేదు. లక్ష్యం తక్కువగా ఉంది, ఈ పథకం కింద రుణాలు ఇవ్వలేమని చెబుతున్నారు.

- రామరాజు, వరంగల్‌

యువత ఆశలు నెరవేర్చాలి..

చాలా మంది యువత సూక్ష్మ, చిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారు. జిల్లాకు కనీసం వేయి మందికైనా అవకాశం కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 2008 నుంచి ఉన్న పథకాన్ని ఇప్పటికైనా విస్తృతపరచాలి. నిబంధనలు సులభతరం చేయాలి. పరిశ్రమలకు ఇచ్చే మొత్తాన్ని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు చేయాలి.

ABOUT THE AUTHOR

...view details