రాజధానిలో పెరుగుతున్న జనాభా, మౌలిక అవసరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, రవాణా సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టిసారిచింది. మరో 30 ఏళ్లకు సరిపోయేలా.... బృహత్ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారులతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వచ్చే '30' ఏళ్లు
బాహ్యవలయ రహదారి లోపల ఉన్న నగరం, వెలుపలి నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారి మధ్యనున్న నగరం, వెలుపల మరో ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించే నగరంగా విభజించి మంచినీరు, ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్యం, వైద్యం, విద్యుత్, రవాణా, విద్య, క్రీడలు తదితర అంశాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖలు తమ వివరాలను అందించాలన్నారు.
ప్రజా రవాణా
బృహత్ ప్రణాళిక రూపకల్పనలో ప్రజల సౌలభ్యం, ప్రభుత్వ విధానాలు, సమీకృత టౌన్ షిప్స్, పరిశ్రమలు, పచ్చదనం, రైలు సదుపాయం తదితర అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ప్రజా రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఉండాలన్నారు. శాఖలన్నీ తమ సేవలను సమర్ధవంతంగా అందించేందుకు యూనిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసే విషయమై ఆలోచించాలని జోషి సూచించారు.
ఒకేచోట సేవలు
శాఖల వివరాల ఆధారంగా కాన్సెప్ట్ నోట్ తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు, రీసోర్స్ పర్సన్స్ సలహాలతో ఆరు నెలల్లోగా బృహత్ ప్రణాళిక రూపొందిస్తామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ అన్నారు. ప్రజలకు నాణ్యమైన, ఆహ్లాదకరమైన జీవనాన్ని అందించటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. అన్ని రకాల సేవలు ఒకేచోట అందించేలా సమీకృత టౌన్ షిప్‌ల అభివృద్ధి ప్రణాళికలను మాస్టర్ ప్లాన్ లో చేరుస్తామని చెప్పారు. ఈ ప్రక్రియలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ విధానాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
ఆరోగ్యం
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా నాలుగు వైపుల ఆసుపత్రి నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి కోరారు. ముఖ్యమంత్రి సూచనల ఆధారంగా నగర అభివృద్ధి వ్యూహాన్ని, బృహత్ ప్రణాళికను రూపొందిస్తామని ఆస్కి ప్రతినిధి శ్రీనివాస చారి తెలిపారు. ప్రజలకు శాఖల ద్వారా మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేలా చూస్తామని అన్నారు.
చట్టాలు
నగర అభివృద్ధి కోసం తీసుకునే చర్యలకు ఇబ్బంది కలగకుండా చట్టాలను రూపొందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ కోరారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని నగరాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రణాళికను తయారు చేయాలని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.
ఇవీ చూడండి:"అందమైన పార్కుగా మార్చండి"