తెలంగాణ

telangana

ETV Bharat / state

హోం ఐసోలేషన్‌లోనే నగరవాసులు.. సగానికి తగ్గిన పరీక్షలు - telangana news

బయటికెళ్తే లాక్‌డౌన్‌.. కొవిడ్‌ పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు తప్పని పరేషాన్‌.. పరీక్ష ఫలితాల కోసం నిరీక్షణలు.. పాజిటివ్‌గా తేలితే గందరగోళం.. ఇవన్నీ తప్పించుకునేందుకు లక్షణాలు కనిపిస్తే నగరవాసులు ఇంటి గడప దాటట్లేదు. నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకూ సంబంధిత కేంద్రాలకు వెళ్లట్లేదు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటా జ్వరం సర్వేలో ఇచ్చిన మందుల్నే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల మహానగరంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో గడిచిన 24 గంటల్లో 658 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసులు, కొవిడ్​ వార్తలు, హైదరాబాద్​ వార్తలు
corona cases, hyderabad news

By

Published : May 17, 2021, 9:16 AM IST

హైదరాబాద్​లో గత వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య పదిహేను వందల నుంచి ఆరువందల్లోకి పడిపోయింది. ఇంటింటా జ్వరం సర్వేలో ఇచ్చిన మందుల్నే వాడేందుకు మొగ్గు చూపడం.. లక్షణాలుంటే హోం ఐసోలేషన్‌లో ఉండడం వల్ల పరీక్షలు సగానికి సగం తగ్గిపోయాయి. తద్వారా కొత్త కేసులూ పరిమిత సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే పాజిటివిటీ రేటులో ఏ మార్పూ లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

వ్యాప్తి తగ్గట్లేదు:

లాక్‌డౌన్‌ విధించినా ఉదయంపూట మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్దఎత్తున గుమిగూడటం, గల్లీల్లో ఒక్కచోటకు చేరడం వల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గట్లేదని హెచ్చరిస్తున్నారు. గత నెలతో పోల్చితే ప్రభుత్వ కేంద్రాలు, యూపీహెచ్‌సీల్లో సగానికి పైగా పరీక్షలు తగ్గాయి. మొన్నటిదాకా 150దాకా పరీక్షలు చేసిన కేంద్రంలో ఇప్పుడు 30కి మించి పరీక్షలు జరగట్లేదు. అయితే పరీక్షల సంఖ్య తగ్గితే వైరస్‌ బారినపడిన వాళ్ల సంఖ్యలోనూ తగ్గుముఖం కనిపించాలి.. కానీ గ్రేటర్‌ పరిధిలో ఈ పరిస్థితి కనిపించట్లేదు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో గడిచిన 24 గంటల్లో 658 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 293, రంగారెడ్డి జిల్లా పరిధిలో 326 కొత్త పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. శనివారంతో పోల్చితే కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది.

పరీక్షలు తగ్గడంతోనే..

వైరస్‌ వ్యాప్తి ఇప్పటికే పెద్దఎత్తున జరిగిపోయిందని.. పరీక్షలు తగ్గడంతోనే కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని నిమ్స్‌ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు తెలిపారు. చాలామంది ఇళ్లకే పరిమితమై సొంత వైద్యం చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లోనూ ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడి సరైన చికిత్స అందకపోవడం, ఇతర వ్యాధుల వల్ల జరిగినవే తప్ప కొవిడ్‌ వల్ల అంత తీవ్రతలేదని ఆయన స్పష్టం చేశారు. కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోందన్నారు. కేసుల తగ్గుదలను తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తూనే.. ప్రభుత్వ ఆంక్షల్ని తప్పనిసరిగా పాటిస్తే కొన్నాళ్లలో పరిస్థితి పూర్తిగా చక్కబడుతుందని ఆయన చెపారు.

ఇదీ చూడండి:కేటీఆర్​కు వెల్లువెత్తుతున్న వినతులు... భరోసా ఇస్తున్న మంత్రి

ABOUT THE AUTHOR

...view details