కళ్లెదుట కొవిడ్ కేసులు పెరుగుతున్నా చిన్నపాటి నిర్లక్ష్యం ప్రమాదకరంగా మారుతోంది. భారీమూల్యం చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్‌లో కరోనా వ్యాప్తికి ఇదే కారణమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనుమానితుల్లో స్నేహితులు, కుటుంబసభ్యులు, ఒకే కాలనీకి చెందిన వ్యక్తులు అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఓ ఆభరణాల దుకాణంలో పనిచేసే సిబ్బంది వరుసగా కొవిడ్ లక్షణాలతో హోం క్వారంటైన్‌కు చేరారు. దుకాణ యజమాని స్వల్పలక్షణాలతో బాధపడుతూ వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దేందుకు రావటమే దీనికి కారణమని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. రాయదుర్గం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఓ వేడుక 10 కుటుంబాలను హోం క్వారంటైన్‌లోకి నెట్టేసింది.
రూటుమార్చి ఔషధాల విక్రయాలు
రెమ్‌డెసివర్ ఇంజక్షన్ దళారులకు కాసులు కురిపిస్తోంది. పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావటంతో విక్రేతలు రూటుమార్చారు. పరిచయం ఉన్న ఆసుపత్రుల్లో కాంపౌండర్లు, ఇతర వైద్యసిబ్బందితో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. నల్లబజారులో ఒక్క రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కొనుగోలు చేయాలంటే మూడు దఫాలుగా పరిశీలన చేస్తున్నారు. కరోనా రోగి అని నిర్ధారించుకున్న తరువాత ఇంజక్షన్ దొరికే వివరాలు చెబుతారు. మరో వ్యక్తి దాని ఖరీదు, ఎక్కడ ఏయే సమయాల్లో లభిస్తుందనే సమాచారం అందిస్తాడు. సొమ్ము చేతిలో పడ్డాకే మూడో వ్యక్తి ఇంజక్షన్ చేతికిస్తాడు.