తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై దూరమవుతున్న అపోహలు.. బాధితులకు చేదోడుగా సన్నిహితులు - బాధిత కుటుంబాలకు చేదోడుగా సన్నిహితులు

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. మహమ్మారి అంటే అందిరికీ భయమే. అయితే కరోనాపై అపోహలు దూరమవుతున్నాయి. బాధిత కుటుంబాలకు చేదోడుగా సన్నిహితులు ఉంటున్నారు. కోలుకొనేంత వరకూ అండగా నిలుస్తున్నారు.

people Helping to the corona victims in hyderabad
కరోనాపై దూరమవుతున్న అపోహలు.. బాధితులకు చేదోడుగా సన్నిహితులు

By

Published : Aug 25, 2020, 10:18 AM IST

ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు. నార్సింగిలో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా పలు ప్రాంతాలు తిరిగారు. ఒళ్లు నొప్పులుగా అనిపిస్తే వైద్య పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండమని వైద్యులు సూచించారు. ఆమెలో ఓ భయం. చుట్టూ ఉన్న కుటుంబాలు ఎలా స్పందిస్తాయి. భర్త, ఇద్దరు చిన్నపిల్లలతో 15 రోజులు ఎలా ఉండాలనే ఆలోచనతో ఇల్లు చేరింది. పక్కింటి వాళ్లకు చెప్పింది. ఆశ్చర్యంగా ఆ అపార్ట్‌మెంట్‌లోని 20 కుటుంబాలు ఒక్కమాట మీదకొచ్చాయి. కోలుకొనేంత వరకూ అండగా ఉంటామంటూ భరోసానిచ్చాయి. అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశాయి. వీడియోకాల్‌ ద్వారా మాట్లాడుతూ ధైర్యాన్నిచ్చారు. అందువల్లే త్వరగా కోలుకున్నానని తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌ నుంచి విధి నిర్వహణలో భాగంగా నగరం చేరిన దంపతులు ఐదేళ్లుగా నల్లగండ్ల సమీపంలోని గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటున్నారు. పిల్లల సంరక్షణకు అతని అత్తమామలు ఇక్కడకు వచ్చారు. నెలన్నర కిందట సాధారణ పరీక్షలకని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వృద్ధుల్లో ఒకరికి కరోనా సోకినట్టు గుర్తించారు. తరువాత అందరికీ సోకింది. వృద్ధులను ఆసుపత్రిలో చేర్పించి, తాము ఇంటికే పరిమితమయ్యారు. ఇది తెలిసిన స్నేహితులు వృద్ధజంట ఆరోగ్యం గురించి ఆరాతీస్తూనే, వీరికి ఆహారం, నిత్యావసరాలు, మందులు గుమ్మం వద్ద పెట్టేవారు. 12 రోజుల తరువాత అందిరికీ నెగెటివ్‌ రాగా, వృద్ధుల్లో ఒకరికి ప్లాస్మా అవసరం పడింది. సైబరాబాద్‌ పోలీసుల సాయంతో ప్లాస్మా కూడా అందింది.

కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా మార్చేసింది. కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలని ఉన్నా భయం కాళ్లను కట్టేసింది. మానవత్వంతో స్పందించాల్సిన చోట దూరాన్ని పెంచింది. ఇది నిన్నటి మాట. మహానగరంలో వైరస్‌ బారినపడిన కుటుంబాలకు అండగా ఉండేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఇరుగుపొరుగు ముందుకొస్తున్నారన్నది నేటిమాట. అపోహలు, అనుమానాలు వదిలేసి జాగ్రత్తలు తీసుకుంటూనే సాయం అందిస్తున్నారు. అదే బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని మనస్తత్వ నిపుణుడు హరీష్‌చంద్రారెడ్డి అంటున్నారు.

మార్పునకు ముందడుగు

మార్కెటింగ్‌ విభాగంలో పనిచేసే కూకట్‌పల్లి వాసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ బారిన పడ్డాడు. అద్దె ఇల్లు, భార్యాపిల్లలు హోం ఐసోలేషన్‌లో ఎలా ఉండాలనుకునే సమయంలో ఓ మిత్రుడు భరోసానిచ్చాడు. తాను ఊరెళుతున్నానని తన గదిలో ఉండమని సూచించాడు. ఇంటి యజమాని సహకరించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇదే తరుణంలో సహచర ఉద్యోగ బృందం అండగా నిలిచింది. ఫోన్‌ చేస్తే అవసరమైన వస్తువులు గుమ్మం వద్దకు చేర్చింది. కరోనా బాధితుల పట్ల సానుభూతితో మెలగటానికి నగర వాసులు క్రమేపీ అలవాటు పడుతున్నారని బోడుప్పల్‌కు చెందిన డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

ఇదీ చూడండి :నాన్నను రెండు వారాల తర్వాత కలిశాను: ఎస్పీ చరణ్

ABOUT THE AUTHOR

...view details