యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో జరిగిన మరియమ్మ కస్టోడియల్ డెత్‌కు కారకులైన పోలీసులపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతమ్‌లు.. డీజిపీ మహేందర్ రెడ్డిని కలిసి అన్యాయంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో.. ఎస్సీ, ఎస్టీలతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై జరుగుతోన్న దాడులను ఫిర్యాదులో ప్రస్తావించారు.
సస్పెండ్ సరిపోదు..
మరియమ్మ ఘటనలో సబ్ ఇన్‌స్పెక్టర్‌ను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తే సరిపోదని నేతలు మండిపడ్డారు. ఘటనకు కారకులైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా పని చేసిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి.. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. పీడీ చట్టాలను ప్రయోగిస్తున్నారు. అన్యాయాలపై ప్రశ్నించేవారే లేరనుకుంటున్నారా..? న్యాయం జరిగే వరకూ పోరాడుతాం. ఘటనపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తాం.
- ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
మరియమ్మను మూడు స్టేషన్లకు తిప్పుతూ దారుణంగా కొట్టి చంపారు. కూతురు చూస్తుండగానే చిత్ర హింసలకు గురి చేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో దళిత, గిరిజనులపై పోలీసుల ఆకృత్యాలు పెరిగి పోయాయి. పోలీసులు.. విచారణ పేరిట ఏళ్ల తరబడి ఎంతోమంది ప్రాణాలు తీశారు. సీఎం కేసీఆర్.. పోలీసులకు విచ్చలవిడి అధికారాలు ఇవ్వడం వల్ల.. సామాన్యులెవరూ బతికే పరిస్థితి కనిపించడం లేదు.
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియోను చెల్లించాలి. మరియమ్మ పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. భూమి, డబుల్ బెడ్ రూమ్‌ను కేటాయించాలి. ప్రభుత్వం ఇకపై దళితులు, గిరిజనులపై దాడులు జరగకుండా చూడాలి.