కృష్ణా జలాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) అనుసరిస్తున్న వైఖరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) తప్పుబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జలజగడం సృష్టిస్తున్నారని ఆరోపించారు. గురువారం ఎస్సార్‌నగర్‌లో పీసీసీ ఉపాధ్యక్షులు సురేష్‌షెట్కర్ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఆయన దాదాపు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలా వంచనకు గురైందో వివరించినట్లు పేర్కొన్న రేవంత్... ఈనెల 7 తర్వాత అన్ని విభాగాల అధ్యక్షులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్‌లోకి నీరు తీసుకుపోతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సుస్పష్టంగా వెల్లడించినా తెరాస ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్‌తో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకున్నాకే జీవో ఇచ్చారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి దొంగచాటుగా పని చేయడం లేదన్న రేవంత్ రెడ్డి ఎప్పుడు ఓట్లు కావాలన్నా.. నీళ్లను బూచిగా చూపిస్తున్నారని ఆరోపించారు.