Pathapantala Jathara: రైతులకు ప్రజలకు చిరుధాన్యాల సాగు, వినియోగం అవశ్యకత తెలియజేసేందుకు దక్కన్ డెవలప్‌మెంట్ సోసైటీ గత 23 సంవత్సరాలుగా పాత పంటల జాతర నిర్వహిస్తోంది. విత్తనాలు.. మట్టే దైవంగా భావించి నిర్వహించే ఈ జాతరలో కులమతాలకు అతీతంగా అందరినీ భాగస్వాములను చేశారు. సంచార జీవవైవిధ్య పండుగగా అంతర్జాతీయ స్థాయిలో ఈ జాతర గుర్తింపు దక్కించుకుంది.
నెల రోజులపాటు సాగిన ఈ చిరుధాన్యాల పండుగ.. ముంగింపు వేడుకలను మాచనూర్ నిర్వహించారు. ఇందులో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ రత్నావతి, ఫుడ్ అండ్ ట్రేడ్ పాలసి ఎనలిస్ట్ దేవిందర్ శర్మ.. ఐఐటీ ఖరగ్‌పూర్ ఆచార్యురాలు డాక్టర్ అర్చన పట్నాయక్‌తో పాటు పలువురు నిపుణులు అతిథులుగా పాల్గోన్నారు.
పాతపంటల సాగు వల్ల బహుల ప్రయోజనాలు ఉన్నాయని దక్కన్ డెవలప్‌మెంట్ సోసైటీ డైరెక్టర్ సతీష్ పేర్కోన్నారు. వర్షాభావ పరిస్థితులను సైతం ఈ పంటలు తట్టుకుంటాయని ఆయన తెలిపారు. వీటి సాగు వల్ల మనుషులకు పౌష్టికాహారం, పశువుల మేత లభించడంతో పాటు పర్యావరణ ప్రయోజనం సైతం కలుగుతుందని సతీష్ స్పష్టం చేశారు.
డీడీఎస్ రైతులు చిరుధాన్యాలు సాగు చేస్తూ తమతో పాటు సమాజాన్ని సైతం ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని.. జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరా రెడ్డి పేర్కోన్నారు.