Passport Services At Post Offices In Hyderabad : పాస్ పోర్టు సేవలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరింత చేరువ చేసింది. పాస్‌పోర్ట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని.. ఆ శాఖ చర్య చేపట్టిందని హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం పరిధిలోని 14 తపాలా కార్యాలయాలలో పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 20నుంచే ఆ తపాలా కార్యాలయాల్లో.. తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల నుంచి వస్తున్న అధిక పాస్‌పోర్ట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు.. తపాలా కార్యాలయాలు పాస్ పోర్టు సేవలను అందిస్తాయని ఆయన ప్రకటించారు.
ఇందుకు ప్రతి బుధవారం సాయంత్రం 4 గంట నుంచి 4.30 గంటల మధ్యలో 700 సాధారణ అపాయింట్మెంట్లు ఇస్తామని పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. ప్రతి రోజు అపాయింట్మెంట్లలో 10 నుంచి 15 శాతం కొన్ని కారణాలతో తిరస్కరణకు గురవుతున్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాలు ఇతర దరఖాస్తు దారునికి ఇబ్బందిగా మారుతోందని ఆందోళన చెందారు. అపాయింట్మెంట్ సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు. ఎక్కువ సమయం తీసుకోకుండా అపాయింట్మెంట్ల కోసం దరఖాస్తుదారులు వేచి చూడకుండా త్వరితగతిన సేవలు అందిస్తామని భావించారు. ఇప్పటి వరకు ఉద్యోగ, విద్య, మెడికల్ అవసరాలకు సంబంధించిన పత్రాలు కలిగిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.