గ్రేటర్ పరిధిలో లాక్‌డౌన్‌కు ముందు 3,750 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేవి. 42 వేల ట్రిప్పులతో 10 లక్షల కిలోమీటర్ల మేర తిరిగేవి. సుమారు 33 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,000 బస్సులను డిపోలకే పరిమితం చేశారు. గతంలో 650 మార్గాల్లో తిరగాల్సిన బస్సులు.. ప్రస్తుతం 450 రూట్లలో తిరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో గతంలో పది వరకు బస్సులను నడిపించేవారు. ప్రస్తుతం ఒకటి రెండు బస్సులను మాత్రమే తిప్పుతున్నారు. సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నామని.. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సొంత వాహనాల్లో..
కరోనా కారణంగా ఎక్కువ శాతం మంది సొంత వాహనాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. గతంలో ఉన్న బస్‌పాస్‌లు సుమారు 30 శాతం వరకు తగ్గిపోయాయి. బస్‌పాస్‌లతో.. గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి నెలకు సుమారు రూ.22 నుంచి రూ.23 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం చాలా మంది ఇంటి నుంచే పనిచేయడం, కోచింగ్ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు తెరవకపోవడం వల్ల బస్‌పాస్‌లు తీసుకొనేవారి సంఖ్య తగ్గింది. ఫలితంగా ఆదాయం తగ్గుతోందని అధికారులు తెలిపారు. అందుకే బస్సుల సంఖ్య తగ్గించినట్లు తెలిపారు.