Congress party padayatra: భారత్ జోడోయాత్రకు కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' పేరుతో పాదయాత్రలు నిర్వహించాలని ఏఐసీసీ అన్నిరాష్ట్రాల పీసీసీ లను ఆదేశించింది. ఇందులో భాగంగా అన్ని నియోజక వర్గాలల్లో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రలు కొనసాగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలల్లో యాత్ర ఫర్ ఛేంజ్ పేరుతో ముందుకుసాగుతున్నారు.
ఇప్పటికే 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రలో కూడలి సమావేశాలకు భారీగా జనం తరలి వస్తుండడంతో పార్టీలో జోష్ వచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కార్నర్ సమావేశాలల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో వివరిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. రేవంత్ యాత్రలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధయాష్కీ, సీనియర్ నాయకుడు వీహెచ్ హన్మంతరావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తోపాటు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.
padayatra of the opposition leaders in the Congress party: ఇది కొనసాగుతుండగానే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వరరెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు 'కాంగ్రెస్ తెలంగాణ పోరు' యాత్ర పేరుతో సమాంతరంగా యాత్ర నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 3నుంచి మొదలయ్యే ఈ యాత్ర బాసర నుంచి హైదరాబాద్ వరకు 20 రోజులపాటు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి యాత్ర నిర్వహించినా... తాము తెలంగాణ పోరు యాత్ర పేరుతో చేపట్టినా... హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌లో భాగమేనని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.