తెలంగాణ

telangana

ETV Bharat / state

గూడ్సు కంటే నెమ్మదిగా.. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగం!! - Oxygen express speed

కరోనా కల్లోలంతో ఆక్సిజన్‌కు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో ఆక్సిజన్‌ తీసుకురావడం ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సేవల్ని తీసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు హైదరాబాద్‌ నుంచి ఖాళీ ట్యాంకర్ల లారీలతో ఒడిశాకు వెళ్లి ప్రాణవాయువు తీసుకువచ్చాయి. ఆదివారం మూడో రైలు బయల్దేరి వెళ్లింది. ప్రాణవాయువును తీసుకువచ్చే ఈ ప్రత్యేక రైళ్లు గూడ్సు రైళ్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. బొగ్గు, సిమెంటు, ఎరువులు, ధాన్యం వంటి సరకుల్ని రవాణా చేసే గూడ్సు రైళ్లు గంటకు 45.23 కి.మీ. సగటు వేగంతో ప్రయాణిస్తుండగా.. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ సగటు వేగం 43 కి.మీ. దాటట్లేదు.

Oxygen express, Oxygen express speed
Oxygen express

By

Published : May 10, 2021, 7:04 AM IST

గూడ్సు రైళ్లు 50-60 వ్యాగన్లతో పొడవుగా ఉంటాయి. ప్రయాణికుల రైళ్లకు 24 వరకు బోగీలు ఉంటాయి. వీటితో పోలిస్తే ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ చాలా చిన్నది. 5-6 లారీలు.. డ్రైవర్ల విశ్రాంతికి ఓ కోచ్‌, ఇంజిన్‌.. అంతే! ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిశా నుంచి బయల్దేరాక గమ్యస్థానమైన సనత్‌నగర్‌ స్టేషన్‌ చేరేవరకు మార్గంమధ్యలో ఎలాంటి అవరోధాలు ఉండవు. ప్రాణాల్ని కాపాడే వాయువును తెచ్చే ఈ రైళ్లకు ప్రత్యేకంగా గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. ఈ రైలు ప్రయాణ సమయంలో మిగతా రైళ్లన్నింటిని నిలిపివేస్తారు.

గరిష్ఠ వేగం 60 కిలోమీటర్లే

ఈ రైళ్లు ప్రయాణించే మార్గంలో ట్రాక్‌ గంటకు 110-130 కి.మీ. వేగాన్ని తట్టుకుంది. సిగ్నలింగ్‌, ఇతర ఆటంకాలు ఏమీ లేవు. కానీ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గరిష్ఠంగా 60 కి.మీ.కి మించి వేగంగా వెళ్లడం లేదు. భద్రత కారణాలతోనే వేగాన్ని పరిమితం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ‘అత్యధిక వేగంతో వెళ్తే లారీ ట్యాంకర్లు కుదుపులకు లోనయ్యే, కిందపడే అవకాశం ఉంది’ అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ‘రైలుపై లారీ ట్యాంకర్లు కదలకుండా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు టైర్లలో గాలిని కూడా తీసేస్తున్నాం. గమ్యస్థానం చేరాక మళ్లీ టైర్లలో గాలి నింపాలి. తిరుగు ప్రయాణంలో రైలుపై ట్యాంకర్లను ఎక్కించాక గాలి తీసి.. సనత్‌నగర్‌ చేరాక ట్యాంకర్లను దింపేటప్పుడు మళ్లీ టైర్లలో గాలి నింపాలి. రైలు నుంచి లారీల్ని దింపడానికే 2 గంటలు పడుతోంది’ అని వివరించారు.

పాల రైలు వేగం 110 కి.మీ.

ద.మ. రైల్వే పరిధిలోని తిరుపతి నుంచి దిల్లీకి పాలు వెళ్తాయి. దూధ్‌ దురంతో పేరుతో ప్రత్యేక రైలు నడుపుతున్నారు. 2,162 కి.మీ. దూరం. 60 కి.మీ.ల సగటు వేగంతో 36 గంటల్లోనే చేరుతుంది. ఈ రైలుకు పాల ట్యాంకర్లు శాశ్వత ప్రాతిపదికన బిగించి ఉన్నాయి. దాంతో గంటకు 110 కి.మీ. వేగంతో వెళ్లినా ఏం కాదు. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లో అలా కాదు.. లారీ ట్యాంకర్లను రైలుపైకి ఎక్కిస్తున్నారు. అందుకే లారీలు కదలకుండా తక్కువ వేగంతో నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రస్తుతం 1,334 కి.మీ. దూరానికి 31 గంటల సమయం పడుతోంది. శాశ్వత ప్రాతిపదికన ట్యాంకర్లు బిగిస్తే 20-22 గంటల్లోనే.. అంటే 9-11 గంటల ముందే ప్రాణవాయువు చేరే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి

ABOUT THE AUTHOR

...view details