హుజూర్‌నగర్‌లో ప్రగతి పరుగులు పెట్టాలి..... సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురింపిచారు. ఎన్నో నీలాపనిందలను విశ్లేషించి నియోజకవర్గ ప్రజలు ఉపఎన్నికలో గొప్ప తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మీరందించిన విజయం మరింత అంకితభావంతో పనిచేసేందుకు ఉత్సాహాన్నిచ్చిందని కృతజ్ఞత సభలో సీఎం స్పష్టం చేశారు.
పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టాలి....
రికార్డు మెజార్టీ అందించిన హుజూర్‌నగర్ ప్రజలకు కృతజ్ఞతగా... నియోజకవర్గ అభివృద్ధికి సీఎం నిధుల వాన కురిపించారు. సెగ్మెంట్ పరిధిలో ఉన్న 134 గ్రామపంచాయతీలకు ఒక్కొక్కదానికి రూ.20 లక్షలు, 7 మండల కేంద్రాలకు రూ.30 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటికీ రూ.15కోట్లు మంజూరు చేస్తున్నట్ల తెలిపారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి నాయకత్వంలో హుజూర్‌నగర్ మంచి పట్టణంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
గిరిజనుల కోరిక మేరకు..
హుజూర్‌నగర్‌లో గిరిజన గురుకుల పాఠశాల, బంజారా భవన్, అలాగే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంతో మాట్లాడి ఈఎస్‌ఐ ఆసుపత్రి కూడా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ కళాశాల, కోర్టు కావాలని అడుగుతున్నారు అవి కూడా మంజూరు చేస్తామని.. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కూడా ఎక్కువ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పరిశుభ్రమైన పట్టణంగా హుజూర్‌నగర్ నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
నాగార్జున సాగర్ ఆయకట్టును కాపాడుకోవాలి...
తెలంగాణలో ఎక్కడా నీళ్లు రాకపోయినా ఆ బాధ తనకు ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలంటే... సాగర్ ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
తప్పకుండా సాగర్ ఆయకట్టుపై దృష్టి సారిస్తానని సీఎం హామీ ఇచ్చారు. గోదావరి నీళ్లు నాగార్జునసాగర్ ఎడమకాలువలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో తాను నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడున్న సమస్యలు నేటికి అలాగే ఉన్నాయని... గత పాలకులు చేసిందేమీ లేదని విమర్శించారు. సాగర్ ఆయకట్టు సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే రైతులతో కలిసి ఈప్రాంతంలో పర్యటించి అన్ని ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు.
కాళేశ్వరం జలాలకు పుష్పార్చన...
ఉదయం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా హుజూర్‌నగర్ కృతజ్ఞత సభకు బయల్దేరారు. భాగ్యనగరం నుంచి హుజూర్‌నగర్ వరకు అడుగడుగన సీఎంకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్హాల్లో కేసీఆర్... హుజుర్‌నగర్ ఉపఎన్నికలో పనిచేసిన నేతలతో కలిసి భోజనం చేశారు. మార్గ మధ్యంలో కాళేశ్వరం జలాలను మోసుకెళ్తున్న కాల్వల వద్ద ఆగి గోదారమ్మకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి పుష్పార్చన చేశారు. గోదావరి జలాలను చూసిన రైతుల కళ్లలో ఆనందాన్ని చూసిన ముఖ్యమంత్రి వారితో కాసేపు సంతోషంగా ముచ్చటించారు.
ఇవీ చూడండి: హుజూర్‌నగర్ నియోజకవర్గంపై కేసీఆర్ వరాల జల్లు