OU Mtech courses: ఇంజినీరింగ్‌లో పీజీ చేసినా.. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా బోధన లేకపోవడంతో సరైన ఉపాధి లభించడం లేదు. ఈ ఇబ్బందిని అధిగమిస్తూ విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగావకాశాలు కల్పించడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఓయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్ణయించింది. కరిక్యులమ్ నిర్మాణం నుంచి బోధన, ప్రాజెక్టుల మూల్యాంకనం వరకు పరిశ్రమల నిపుణులను భాగస్వామ్యం చేయనుంది. 50 శాతం సబ్జెక్టులు పరిశ్రమల నిపుణులే బోధిస్తారు. విదేశాల్లో ఉంటే ఆన్‌లైన్‌లో, ఇక్కడే ఉంటే ప్రత్యక్షంగా హాజరై పాఠాలు చెప్పనున్నారు. పేరొందిన పరిశ్రమల్లో కీలక స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల సేవలు వినియోగించుకోనున్నారు. ఏవైనా కోర్సుల్లో అందుబాటులో లేకపోతే వివిధ పరిశ్రమల నిపుణులను ఆహ్వానిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా 15లక్షల బడ్జెట్ కేటాయించారు.
ఎంటెక్‌లో చేరిన విద్యార్థులు ఎక్కువగా వివిధ కారణాలతో కోర్సులు కొనసాగించడం లేదు. ఉద్యోగాలు రావడం, మొదటి సెమిస్టర్‌లో బ్యాక్‌లాగ్‌లు, ఫీజుల ఇబ్బందులతో మధ్యలో మానేస్తున్నారు. అప్పటివరకు చదివిన చదువు వృథా అవుతోంది. దీన్ని అధిగమించేందుకు వీలుగా అప్పటివరకు చదివిన కోర్సులకు సంబంధించి క్రెడిట్స్‌ను పార్ట్‌టైంలోకి బదలాయించనున్నారు. దీనివల్ల విద్యార్థులు తిరిగి వచ్చి ఉద్యోగాలు చేస్తూ పార్ట్‌టైంలో కోర్సులు పూర్తి చేసి పట్టాలు పొందే వీలుంటుందని, ఇందుకు ఏడేళ్ల వెసులుబాటు ఉంటుందని ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీరామ్ వెంకటేశ్ పేర్కొన్నారు. బీటెక్, ఎంటెక్ ప్రాజెక్టులను పరిశ్రమల నిపుణులు, ఐఐటీ, ఎన్ఐటీలకు చెందిన ఆచార్యులే మూల్యాంకనం చేయనున్నారు. ఎంటెక్‌లో విద్యార్థులు పరిశోధనపత్రాల సమర్పణ, పేటెంట్ దరఖాస్తు చేస్తే అందుకు అయ్యే ఖర్చు కళాశాలనే భరిస్తుంది.