CPGET: డిగ్రీలో ఏ కోర్సు చేసినా బేఫికర్... పీజీ చదివేందుకు అవకాశమున్న కోర్సులన్నిటికీ కలిపి ఈసారి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్)లో భాగంగా ఒకటే ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు. ఒకే రకం కోర్సులకు కలిపి ఒకటే పరీక్ష జరపాలని, సాధ్యమైనంతలో పరీక్షల సంఖ్య తగ్గించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఉన్నత విద్యామండలి సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చేస్తున్న కసరత్తు తుదిదశకు వచ్చింది. మరికొన్ని మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన వర్సిటీల్లోని అన్ని పీజీ కోర్సులతోపాటు జేఎన్‌టీయూహెచ్‌లోని సైన్స్ పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి 2019 నుంచి సీపీగెట్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 75 పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా ప్రవేశపరీక్షలు జరపాల్సి వస్తోంది. విద్యార్థులు రెండు, మూడు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఫలితంగా విద్యా సంవత్సరం ఆలస్యమవుతోంది. అందుకే పరీక్షల సంఖ్యను తగ్గించాలన్న లక్ష్యంతో సీపీగెట్ అధికారులు 20 రోజులుగా అధ్యయనం చేస్తున్నారు. దేశంలోని వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే సారూప్య సబ్జెక్టులకు కలిపి ఒకటే ప్రశ్నపత్రం ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు.
*మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎంఎల్‌ఐసీ, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ సోషల్ వర్క్, ఎంఏ ఆర్కియాలజీ తదితర కోర్సులకు డిగ్రీలో ఏ కోర్సు చేసినవారైనా అర్హులే. ప్రస్తుతం వాటికోసం వేర్వేరుగా పరీక్షలు జరుపుతున్నారు. ఈసారి ఒకటే పరీక్ష నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు.
*ఇప్పటివరకు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు వేర్వేరు ప్రవేశపరీక్షలు జరుపుతున్నారు. ఈసారి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులు రెంటిలో ఏదోఒక కోర్సులో చేరవచ్చు.