ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital) వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయిన ఓ మహిళ నుంచి చర్మాన్ని సేకరించి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన చర్మనిధి బ్యాంకులో భద్రపరిచారు. ఇటీవల ప్రమాదంలో గాయపడి, జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 53 ఏళ్ల మహిళ బ్రెయిన్‌డెడ్ అయింది. ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కాలేయం, మూత్రపిండాలతోపాటు చర్మదానానికీ అంగీకరించారు. ఉస్మానియాకు చెందిన చర్మనిధి నిపుణులు అపోలో ఆసుపత్రిలో ఆమె చర్మాన్ని సేకరించి, చర్మనిధి కేంద్రానికి తరలించినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ నుంచి 16 స్కిన్ గ్రాఫ్ట్‌లను సేకరించినట్లు వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆసుపత్రులు గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు చేస్తున్నాయి. చర్మాన్ని సేకరించి భద్రపరిచే సాంకేతికతను ఏ ఆసుపత్రీ నిర్వహించడం లేదు. కాలిన గాయాలకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ ఏర్పాట్లు లేవు. ఉస్మానియా ఆసుపత్రిలో హెటిరో డ్రగ్స్, రోటరీ క్లబ్ సాయంతో దాదాపు రూ.70 లక్షలు వెచ్చించి ఇటీవల చర్మనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జీవన్‌దాన్ ట్రస్టు ఆధ్వర్యంలో బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి చర్మాన్ని సేకరించి ఇక్కడ భద్రపర్చి, అవసరమైన వారికి వినియోగిస్తారు. తొలిసారి ఉస్మానియాలో ఇలాంటి బ్యాంకు అందుబాటులోకి రావడం విశేషమని.. ఇందుకు కృషి చేసిన వైద్యులు, సాంకేతిక నిపుణులను డాక్టర్ నాగేందర్ అభినందించారు. ఒకసారి సేకరించిన చర్మాన్ని అయిదేళ్ల వరకు భద్రపరిచే అవకాశం ఉస్మానియా కేంద్రంలో ఉందని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. చర్మ బ్యాంకు సమన్వయకర్త డాక్టర్ మధుసూదన్ నాయక్, డాక్టర్ నిశాంత్ పాల్గొన్నారు.