హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఓపీ సమయాలను కుదించారు. ఉదయం 9 నుంచి 11 వరకు మాత్రమే ఓపీ కార్డులు జారీ చేయనున్నారు. అప్పటికే కార్డులు తీసుకొని క్యూలో ఉన్నవారికి మాత్రం చికిత్సలు అందిస్తారు. సాధారణ రోజుల్లో ఉదయం 9 నుంచి 12 వరకు కార్డులు జారీ చేసేవారు. కరోనా కేసులు పెరుగుతుండటం... పలువురు వైద్య సిబ్బంది ఆ మహమ్మారి బారిన పడుతుండటం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆ ఆసుపత్రులకు తాకిడి
నగరంలో గాంధీ, ఉస్మానియాతోపాటు వాటి పరిధిలోని ప్రభుత్వ దవాఖానాలు కీలకమైనవి. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ కేసులకు కేటాయించడం వల్ల ఇతర చికిత్సల భారం ఉస్మానియా, ఇతర ఆస్పత్రులపై పడింది. రోజు ఉస్మానియాకు 1100-1200 మంది రోగులు వస్తున్నారు. నిలోఫర్, పేట్లబుర్జు, సరోజినీదేవి, సుల్తాన్‌బజార్, ఈఎన్‌టీ, ఛాతీ ఆసుపత్రులకూ తాకిడి పెరిగింది. ఓపీకి వస్తున్న రోగుల్లో కొందరికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.
40 మందికి పైగా కరోనా
ఇప్పటికే 40 మందికి పైగా వైద్య విద్యార్థులు, వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో వారిపై పని భారం తగ్గించడంతోపాటు ఎక్కువ సమయం క్వారంటైన్ కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు బయటపడినా సోకకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇలా చేస్తున్నారు. అయితే రోగుల సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు.
రెండు బృందాలుగా
ఉస్మానియాతోపాటు ఇతర కీలక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని రెండు బృందాలుగా విభజించనున్నారు. 50 శాతం మంది వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉంటారు. మిగతా 50 శాతం మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. ఆమేరకు ఓపీ సేవలతోపాటు కొన్ని రకాల సర్జరీలను వాయిదా వేయనున్నారు. అత్యవసర కేసులకు ఎప్పటిమాదిరే సేవలందిస్తారు.
కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి రోగినీ క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఎలాంటి లక్షణాలు కనిపించినా ఐసోలేషన్‌కు తరలించి పరీక్షలు చేస్తారు. కొవిడ్ రోగులకు దగ్గరగా పనిచేసే వైద్యులు, సిబ్బంది విషయంలో మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్‌లు, గ్లౌజులు వంటివి అందరికీ సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?