హైదరాబాద్‌లో నగర సేద్యంపై ఉద్యానవన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి ఇళ్ల యజమానులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. నగరీకరణ నేపథ్యంలో డాబాలు, బాల్కనీలు, బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు పెంచుకునేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా కనీసం పది నుంచి 15 రకాల మొక్కలు పెంచుకోవాలని సూచించారు.
'కొంచెం జాగా ఉన్నా మొక్కలు పెంచేయండి'
జంట నగరాల్లో మిద్దె తోటల పెంపకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న దృష్ట్యా పెద్ద సంఖ్యలో ఇళ్ల యజమానులు ముందుకు రావాలని ఉద్యానవన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి అన్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా కనీసం 10 నుంచి 15 రకాల మొక్కలు పెంచుకోవాలని సూచించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే రసాయన అవశేషాల్లేని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని తెలిపారు. ఈ క్రమంలో ఇంటి పరిసరాల్లో ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా... విధిగా మొక్కలు పెంచుకోవాలన్నారు. సొంతంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకుని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జంట నగరాల్లో కొన్నేళ్లుగా ఉద్యాన శాఖ ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఔత్సాహిక ఇళ్ల యజమానులు, యువతకు మిద్దెతోటల నిర్వహణపై శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మానవ వనరుల విభాగం ఇన్ఛార్జి డాక్టర్ మమత, శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ సైదయ్య, ప్రముఖ ఆహార నిపుణులు డాక్టర్ శ్రీలత, పలువురు మిద్దెతోటల నిర్వాహకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గిఫ్ట్ కార్డ్, క్యాష్ బ్యాక్ కోసం ఆశపడితే అంతే సంగతి!