కార్యాలయాల తరలింపు... ముమ్మరంగా పనులు
సచివాలయ కార్యాలయాలను బీఆర్కే భవన్‌లోకి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా మంత్రుల కార్యాలయాల తరలింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదార్ సిన్హాతో సమావేశమయ్యారు. తరలింపు ప్రక్రియను సమీక్షించారు. మంత్రుల కార్యాలయాల విషయమై ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటి వరకు తరలించిన కార్యాలయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియ పూర్తయ్యేందుకు అవసరమయ్యే సమయం, తదితర వివరాలు ఆరా తీశారు.
ఇబ్బందులు అధిగమించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
ఇప్పటివరకు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మాత్రమే తమ కార్యాలయాలను తరలించారు. శాఖాధిపతుల కార్యాలయాలు అనువుగా ఉండడం వల్ల ఇరువురి కార్యాలయాలు వెంటనే తరలి వెళ్లాయి. మిగతా మంత్రులు... బీఆర్కే భవన్ సౌకర్యంగా లేదని, సరిపోదని తరలింపు కోసం సుముఖత చూపడం లేదు. మంత్రుల కార్యాలయాల కోసం ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై అధికారులు చర్చిస్తున్నారు. మరోవైపు ఇతర కార్యాలయాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.