ప్రపంచం అంతర్జాలమయమైపోతోంది. ఏది కావాలన్నా అంతా ఆన్లైన్లోనే. కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా… చిరునామా కనుక్కోవాలనుకున్నా... చివరకు ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకున్నా అంతర్జాలమే వేదికగా మారుతోంది. ఆన్‌లైన్ అంగళ్లో రకరకాల వస్తువులు ఒక్క చోటే లభిస్తాయి. నచ్చితే వెంటనే కొనుగోలు చేయొచ్చు. బయట మార్కెట్‌తో పోల్చుకుంటే కాస్త ధరలు కూడా తక్కువే. అందుకే... ఇప్పుడు ఆన్‌లైన్ మార్కెట్‌కు ఆదరణ పెరుగుతోంది. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా విక్రయదారులు సైతం తమ వస్తువులను అంతర్జాలం వేదికగా ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం అనేక ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు పుట్టుకొచ్చాయి. వ్యాపారికి, వినియోగదారుడికి మధ్య వారధిగా నిలుస్తున్నాయి.
తక్కువ ధరలకే వస్తువులిస్తామంటూ మోసాలు..
ఈ మార్కెటింగ్ సంస్థల్లో కొన్ని పారదర్శకంగా ఉంటున్నా... కొన్ని మాత్రం లావాదేవీలకు భద్రత కల్పించలేకపోతున్నాయి. ఫలితంగా... ఎంతో మంది మోసపోతున్నారు. ఓఎల్ఎక్స్ ఈ కోవలోనిదే. పాతది ఏదైనా సులువుగా విక్రయించే వేదిక ఈ ఓఎల్ఎక్స్. ఇందులో అమ్మకాలు.. కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ సైట్లో కొన్ని లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరలకే బైకులు, కార్లు అంటూ ఓఎల్‌ఎక్స్‌లో వస్తున్న ప్రకటనలు ఇస్తున్నారు. ఇవి చూసి ఆకర్షితులవుతున్న కొనుగోలుదారులు క్రమంగా సైబర్ నేరస్థుల వలలో చిక్కుకుంటున్నారు. చివరకు విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
కరోనా కాలాన్ని వాడేసుకుంటున్నారు...
కరోనా వైరస్ విస్తరిస్తుండటం వల్ల బహిరంగ విపణిలో మాస్కులు, శానిటైజర్లకు గిరాకీ పెరిగింది. ధరలూ అధికమయ్యాయి. ఎన్-95 మాస్కు అయితే ఏకంగా 250-400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇదే ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఓఎల్ఎక్స్‌లో మోసాలకు తెరతీస్తున్నారు. ఎన్-95 మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, ఫేస్ షీల్డ్ మాస్కులు తక్కువ ధరలకే విక్రయిస్తామంటూ ప్రకటనలిస్తున్నారు. వీటిని చూసి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తున్న వారిని సైబర్ నేరస్థులు నమ్మిస్తున్నారు. మాస్కులకు ఎక్కువ గిరాకీ ఉన్నందున కొంత డబ్బు వేస్తేనే ఆర్డర్ తీసుకుంటామని చెబుతున్నారు. బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చి అందులో విడతల వారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇలా లక్షల్లో వసూలు చేస్తున్నారు. చాలా రోజులు గడిచే వరకూ బాధితులు తాము మోసపోయానని గ్రహిస్తున్నారు.