లోక్సభ ఎన్నికలపై అధికారుల కసరత్తు లోక్సభ ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం రాష్ట్రంలో కసరత్తు వేగవంతమైంది. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల మొదటి దశ తనిఖీ ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు. తెలంగాణలోని 17 ఎంపీ నియోజకవర్గాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా సంయుక్త కలెక్టర్లు.. రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్లో కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. పార్లమెంట్ ఎన్నికల కోసం నియోజకవర్గానికి ఒకరు చొప్పున సాధారణ పరిశీలకులు, ఇద్దరు చొప్పున వ్యయ పరిశీలకులను నియమించనున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కలిశారు. ఎన్నికల సన్నాహకాలను సీఈసీకి వివరించారు. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 22న ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం ఓటర్ల సంఖ్య రెండు కోట్ల 90 లక్షలు దాటింది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈ నెల 22న స్పష్టత రానుంది.