దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్ ఒకరని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ చేరారు. ఒడిశా మాజీ మంత్రి శివరాజ్ పాంగి, ఇతర నాయకులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుల తరఫున గమాంగ్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రైతుల సమస్యలపై గిరిధర్ గమాంగ్ పోరాడారని స్పష్టం చేశారు. భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోందన్న కేసీఆర్.. ప్రపంచ దేశాల్లో కంటే భారత్‌లో వనరులు ఎక్కువ ఉన్నాయని తెలిపారు.
అమెరికా, చైనా, అభివృద్ధి చెందిన దేశాల కంటే వనరులు ఎక్కువ ఉన్నాయని కేసీఆర్ వెల్లడించారు. దేశ యువత అమెరికా వెళ్లేందుకు తహతహలాడుతున్నారని చెప్పారు. అమెరికా గ్రీన్ కార్డు వస్తే సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికీ భారత్‌లో రైతులకు సాగునీరు, విద్యుత్ అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా రైతులు, పేదల పరిస్థితులు మారలేదని మండిపడ్డారు.
భారత్ ఎలాంటి లక్ష్యం లేకుండా ముందుకు వెళ్తోంది. దౌర్జన్యంతో ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా మారింది. ఎక్కడైనా ఎన్నికల్లో గెలిస్తే సమాజ సేవ లక్ష్యంగా ఉంటుంది. ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు కానీ ప్రజలు ఓడుతున్నారు. ఎన్నికల్లో పార్టీలు, నేతలు కాదు.. ప్రజలు గెలవాలి. ఎన్నికల్లో ప్రజలు గెలవడమే అసలైన ప్రజాస్వామ్యం. - కేసీఆర్, ముఖ్యమంత్రి
భారత్‌లో పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర ఆర్థికంగా నిలదొక్కుకున్న రాష్ట్రమన్న సీఎం... మహారాష్ట్ర కంటే తెలంగాణ బలహీనమైనదని తెలిపారు. గతంలో తెలంగాణ నుంచి ఉపాధి కోసం మహారాష్ట్ర వలస వెళ్లేవారు.. ఇప్పుడు వలస వెళ్లిన ప్రజలు వెనక్కి వస్తున్నారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో సాధ్యమైనపుడు మహారాష్ట్ర, ఒడిశాలో ఎందుకు కాదు. ఆర్థిక సమస్యలు కాదు.. చిత్తశుద్ధి లోపం వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే విధంగా బీఆర్ఎస్ మార్పు తెస్తుంది. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. పరివర్తన సమయంలో చాలామంది ఇష్టారీతిన విమర్శలు చేస్తారు. మానవ హక్కులు భిక్షగా కాకుండా హక్కుగా సాధించాలి. దేశంలో 4 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంది. దేశంలో ఇప్పటివరకు 2.10 లక్షల మెగావాట్ల విద్యుత్ కంటే ఎక్కువ వాడలేదు. - కేసీఆర్, ముఖ్యమంత్రి
మన వద్ద వనరులు ఉన్నా.. అమెరికా వద్ద చేతులు చాచడం ఎందుకని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నారన్నారు. కంపెనీల ప్రైవేటీకరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. నష్టాలేమో సామాన్యుడి నెత్తిన రుద్దుతున్నారని తెలిపారు. లాభాలు వస్తే మాత్రం కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. దుర్భర పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకే బీఆర్ఎస్ ఏర్పాటైందని వివరించారు.
ఇవీ చదవండి: