తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మృతుల దహన సంస్కారం కష్టమే!

కరోనా రెండో దశ మానవ సంబంధాలను దూరం చేస్తోంది. అప్పటివరకు కలసిమెలసి తిరిగిన వ్యక్తి పాజిటివ్‌తో చనిపోతే అంతిమయాత్రకు కనీసం నలుగురు వ్యక్తులు రావడం లేదు. చేసేదిలేక జేసీబీలు, ట్రాక్టర్లపై తీసుకెళ్లి ఖననం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, నగరపాలికల్లో అధికారులు వీరికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నా గ్రామాల్లో సమస్యలు వస్తున్నాయి.

corona funerals, Obstacles to corona funerals in villages
corona funerals

By

Published : May 10, 2021, 6:53 AM IST

Updated : May 10, 2021, 7:05 AM IST

  • వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దామన్‌పేటలో ఇటీవల ముగ్గురు కరోనాతో మరణించారు. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు వీల్లేకపోయింది. కరోనా మృతదేహాల అంతిమ సంస్కారాలపై అవగాహన లేకపోవడంతో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రాలేదు. చనిపోయిన వారి మృతదేహాలను జేసీబీతో తీసుకెళ్లి ఖననం చేయాల్సివచ్చింది.
  • కామారెడ్డి రైల్వేస్టేషన్‌ సమీపంలో భిక్షాటన చేసే మహిళ చనిపోయింది. కొవిడ్‌తో కన్నుమూసిందన్న అనుమానంతో మృతదేహాన్ని తరలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆమె భర్త మూడున్నర కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖ కొన్ని సూచనలు చేసింది. పీపీఈ కిట్లు ధరించి, దూరంగా నిలబడి నిబంధనలు పాటిస్తూ చేయవచ్చంది. ఈ మేరకు కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రైవేటు ఏజెన్సీలు వైరస్‌తో చనిపోయినవారికి మతం, ధర్మం ఆధారంగా సేవాదృక్ఫథంతో అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. గ్రామాల్లో గౌరవప్రదంగా అందరికీ ఒకేచోట అంత్యక్రియలు చేసేందుకు వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నా కనీసం సాటిమనిషిగా స్థానిక సంస్థలు అంత్యక్రియలు నిర్వహించలేకపోతున్నాయి. ‘కరోనా మృతదేహాలకు అంత్యక్రియల విషయమై పంచాయతీలకు విధివిధానాలు జారీ కాలేదు. మౌలిక సదుపాయాలు, పీపీఈ కిట్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మహమ్మారి కట్టడికి నిబంధనలు, విధివిధానాలు జారీ చేసినా, మృతదేహాల అంతిమ సంస్కారానికి నిబంధనలు జారీ చేయలేదు’ అని పంచాయతీరాజ్‌ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక స్థలాలు

కొవిడ్‌ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానిక శ్మశానవాటికల్లో ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. ఒకటి లేదా రెండు ప్లాట్‌ఫారాల్లో దహనం చేసేందుకు స్థానిక సంఘాలు అనుమతించాయి. ఒక్కో దానిపై సాధారణంగా మూడు మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవచ్చు. కరోనాతో మరణాలు పెరగడంతో ఒక్కో ఫ్లాట్‌ఫారంపై ఐదు నుంచి ఆరు మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్నారు. ‘హైదరాబాద్‌లోని కాచిగూడ, గోల్నాక ప్రాంతాల నుంచి రోజుకు మూడు కరోనా మృతదేహాలు వస్తున్నాయి. వీరికోసం ప్రత్యేకంగా ఫ్లాట్‌ఫారం కేటాయించాం. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు’ అని అంబర్‌పేట శ్మశానవాటిక ప్రతినిధి శివకుమార్‌ తెలిపారు. వరంగల్‌ శ్మశానవాటికల్లో కరోనా మృతదేహాలను అనుమతించడం లేదు. అక్కడి పోతన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అక్కడివరకు వెళ్లలేని కుటుంబసభ్యులు స్థానిక నది, కాలువల తీరాన అంత్యక్రియలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని శ్మశానవాటికల్లో రాత్రి 7 గంటల తరువాత కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు అనుమతిస్తున్నారు.

జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించాలి

కరోనాతో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే శవాలను అక్కడి నుంచి తీయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిబంధనలు పాటిస్తూ అంతిమసంస్కారాలు చేయవచ్చు. బంధువులు తక్కువ సంఖ్యలో వెళ్లాలి. రెండు, మూడు మెడికల్‌ మాస్కులు లేదా ఎన్‌-95 మాస్కు, పీపీఈ కిట్‌, చేతి తొడుగులు, ఫేస్‌షీల్డ్‌, పాదాలకు తొడుగులు ధరించి, మృతదేహాన్ని ప్లాస్టిక్‌ లేదా రెండు మూడు వస్త్రాల్లో చుట్టాలి. శానిటైజ్‌ చేయాలి. అంత్యక్రియలు ముగిసిన వెంటనే చేతులు శుభ్రం చేసుకుని సబ్బుతో స్నానం చేయాలి.

- డాక్టర్‌ మహ్మద్‌ రజామాలిక్‌ ఖాన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కేఎంసీ

అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం

నగరపాలిక పరిధిలో రూపాయికే అంత్యక్రియల పథకం అమలవుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాలను శానిటైజ్‌ చేసి, ప్రత్యేకంగా ప్యాక్‌చేసి ఇస్తున్నారు. ఒకవేళ శానిటైజ్‌ చేయకుంటే మృతదేహాల ప్యాక్‌ కోసం వచ్చిన ప్రత్యేక కిట్‌లను ఉపయోగిస్తున్నాం. పురపాలిక తరఫున సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, మాస్కులు, చేతితొడుగులు ఇస్తున్నాం. కరోనా నిబంధనల మేరకు అప్పటికే శ్మశానంలో సిద్ధం చేసిన కట్టెలపై ఆయా మృతదేహాలకు సిబ్బంది దహన సంస్కారాలు చేస్తున్నారు.

- రామనోహర్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ కరీంనగర్‌ నగరపాలక సంస్థ

ఇదీ చదవండి:కష్టకాలంలో సేవచేయడానికి యువవైద్యులు ముందుకు రావాలి: సీఎం

Last Updated : May 10, 2021, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details