Nursery Mela in Hyderabad: హైదరాబాద్ పీవీ మార్గ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో.. అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన 2023 కోలాహలం నడుమ సాగుతోంది. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో 5 రోజులపాటు జరగనున్న 13వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి పేరెన్నిక గన్న ప్రముఖ కంపెనీలు, నర్సరీలు, అంకుర కేంద్రాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా సంఘాలు ఆధ్వర్యంలో 150 పైగా స్టాళ్లు కొలువుతీరాయి.
వాతావరణ మార్పుల నేపథ్యంలో మారుతున్న ఆహారపు అలవాట్లు.. అభిరుచులతోపాటు నగర సేద్యం పట్ల వ్యాపకం పెరుగుతున్న దృష్ట్యా.. అన్ని వర్గాలకు ఉపయోగరమైన విత్తనాలు, మొక్కలు, టిష్యూ కల్చర్, సీడ్లింగ్స్, బొన్సాయో మొక్కలు, హైడ్రోపొనిక్ టెక్నాలజీ, ల్యాండ్ స్కేపింగ్ టెక్నాలజీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసమే ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళా.. చాలా బాగుందని, ఎన్నో రకాల మొక్కలు, అవసరమైన విజ్ఞానం లభ్యమవుతోందని సందర్శకులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటల సాగు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో పలు నర్సరీలు తమ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు, బుకింగ్‌లు చేపట్టాయి. టిష్యూ కల్చర్, సీడ్లింగ్‌లో భాగంగా అరటి, బొప్పాయి, మామిడి, సపోట వంటి మొక్కలు కొనుగోలుకు రైతులు ఆసక్తి ప్రదర్శించారు. అదే సమయంలో హైదరాబాద్ నగరవాసులు సైతం తమ ఇళ్ల పక్కన, ఫాం హౌసులు, కొత్తగా కొనుగోలు చేసిన ప్లాట్లలో నాటేందుకు.. ప్రత్యేక శ్రద్ధ చూపించి కొనుగోలు చేశారు.