తెలంగాణ

telangana

ETV Bharat / state

VACCINE: డోసుల సంఖ్య తగ్గుతోంది.. థర్డ్​వేవ్ ముప్పు ముంచుకొస్తోంది! - తగ్గిపోతున్న డోసుల సంఖ్య

తొలినాళ్లలో హైదరాబాద్​లో 30-40 వేల కరోనా డోసులు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య సగానికి పడిపోయింది. ఇలానే జరిగితే మూడో దశలో ముప్పు తప్పదని ప్రజలు భావిస్తున్నారు. టీకా వేయించుకునేందుకు ప్రభుత్వ కేంద్రాల వద్దకు వెళ్తున్న వారికి... అక్కడ సిబ్బంది నుంచి సరైన సమాధానం లేదని వాపోతున్నారు.

VACCINE
థర్డ్‌వేవ్​ ముప్పు తప్పదా?

By

Published : Aug 4, 2021, 9:01 AM IST

కొవిడ్‌ టీకా కార్యక్రమంలో మహానీరసం నెలకొంది. రోజు రోజుకూ ఇచ్చే టీకాల డోసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలినాళ్లలో హైదరాబాద్‌ జిల్లాలో రోజుకు 30-40 వేల డోసులు ఇచ్చే వారు. ప్రస్తుతం ఆ సంఖ్య సగానికి పడిపోయింది. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరిలోనూ అదే పరిస్థితి. ప్రభుత్వ ఆధ్వర్యంలో టీకా కేంద్రాలకు కొదవ లేదు. అయితే కార్యక్రమం ఒక ప్రణాళికాబద్ధంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉదయం 9 గంటల వరకు ఏ కేంద్రంలో ఏ టీకా.. ఏ డోసు ఇస్తారో కూడా అక్కడి సిబ్బందికే సమాచారం ఉండటం లేదు. దీంతో చాలామంది ఉదయం 7 గంటలకే టీకా కేంద్రాలకు చేరుకొని నిరీక్షిస్తున్నారు. తీరా అక్కడ ఇచ్చే టీకా, డోసులు వేరే కావడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. మళ్లీ రెండో రోజు అదే పరిస్థితి. నగరంలో చాలామంది దిగువ మధ్యతరగతి వర్గాలే. టీకాలకు ప్రైవేటులో డబ్బులు వెచ్చించలేక ప్రభుత్వ కేంద్రాలకు క్యూలు కడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ మొదలు కొని టీకా తీసుకునే వరకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వ కేంద్రాల వద్దకు వెళుతున్న వారికి అక్కడ సిబ్బంది నుంచి సరైన సమాధానం ఉండటం లేదంటూ వాపోతున్నారు.

భువనేేశ్వర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి..

దేశంలో 100 శాతం టీకా కార్యక్రమం పూర్తి చేసిన నగరంగా ఒడిషాలోని భువనేేశ్వర్‌ రికార్డుకెక్కింది. అయితే గ్రేటర్‌ జనాభాతో పోల్చుకుంటే భువనేశ్వర్‌ జనాభా చాలా తక్కువే. అక్కడ 11.9 లక్షల మంది ఉంటే.. టీకాకు అర్హులు 9 లక్షలు పైనే. అదే హైదరాబాద్‌ మహానగర జనాభా కోటిన్నర పైనే. జనాభా పరంగా చూస్తే.. భువనేశ్వర్‌తో నగరానికి పోలిక లేకున్నా సరే. ఆ నగర స్ఫూర్తిని మాత్రం కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే. అక్కడ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా రెండు డోసులు ఇచ్చినట్లు భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తాజాగా వెల్లడించింది. ఈ క్రతువులో 31 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, 33 వేల మంది ఫ్రంట్‌లైన్‌ వర్క్‌ర్లు పాల్గొన్నారు. టీకాపై పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించారు. నేరుగా టీకా కేంద్రాలకు వచ్చే ప్రజల నుంచి డేటా తీసుకొని అక్కడికక్కడే కొవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించి టీకా అందించారు. ఉపాధి కోసం నగరానికి వచ్చిన లక్షమంది కార్మికులకు టీకా రెండు డోసులు అందించామని కార్పొరేషన్‌ ప్రకటించింది.

ఆ నగరంతో పోల్చితే మౌలిక వసతులు, వనరుల్లో ఎంతో మెరుగ్గా ఉన్నాసరే.. అనుకున్నంత వేగంగా టీకా కార్యక్రమం సాగడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అప్పుడే థర్డ్‌వేవ్‌ను సమర్థంగా అడ్డుకోవచ్చునని పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి:CANCER CASES: తెలుగు రాష్ట్రాలను కబళిస్తున్న క్యాన్సర్‌

ABOUT THE AUTHOR

...view details