Numaish Exhibition 2024 Timings and Rules: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సందర్శించేందుకు ఎన్నో ప్రదేశాలున్నాయి. చారిత్రక కట్టడాలు మొదలుకుని పురాతన ఆలయాలు.. ఇంకా ఎన్నో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా ఎన్నో ఎగ్జిబిషన్లు కూడా ప్రజలను అలరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నాంపల్లిలో నిర్వహించే నుమాయిష్‌కు ప్రత్యేక ప్లేస్ ఉంది. ఈ ఏడాది జనవరి1 నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అసలు దీని చరిత్ర ఏంది..? ఎన్ని స్టాల్స్ ఉన్నాయి..? టైమింగ్స్ ఏంటి..? ఎంట్రీ ఫీజు ఎంత..? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ టాప్-10 టిప్స్ మీ కోసమే!
ఇదీ చరిత్ర: ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నేతృత్వంలో మొదటిసారి 1938వ సంవత్సరం నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో 10రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ప్రారంభమైంది. ఆ తర్వాత 1946లో నాంపల్లి మైదానంలోని 26 ఎకరాల సువిశాల స్థలంలో నిర్వహించారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంతో ఈ రెండేళ్లు నుమాయిష్ ఏర్పాటు చేయలేదు.
1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే ప్రారంభమైంది. అప్పుడు నుమాయిష్ పేరును ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా మార్చారు. అప్పటి నుంచి 2020 వరకు విరామం లేకుండా ఏటా నుమాయిష్ దిగ్విజయంగా కొనసాగింది. కానీ, మధ్యలో కరోనాతో మళ్లీ విరామం పడింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.
ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న 'నుమాయిష్' కార్యక్రమానికి దేశ, విదేశాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం లభించడం సహా, వాటి విక్రయాలకు సైతం ఈ ఈవెంట్ కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.