NRI financial help to Pastham Mogiliah: తోడుగా మా తోడుండీ.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కడెళ్లినావు కొమురయ్యా.. నీ జ్ఞాపకాలు మరవమయ్యో కొమురయ్యా.. అంటూ ప్రేక్షకుల హృదయాల్లో దుఖ:రసం పొంగించి.. కుటుంబ సంబంధాల్లో అడుగంటిపోతున్న ప్రేమానురాగాల్ని తన గానంతో సున్నితంగా తట్టిలేపిన పస్తం మొగిలయ్య గత కొంత కాలంగా కిడ్ని వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ 1వ తేదీన ఈటీవీ భారత్ ఆయనపై ప్రతేక స్టోరీ చేసి ఆర్థిక సాయం చేయమని కోరింది. దీనిపై స్పందించిన అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ బృందం ఆయనకు ఆర్థిక సాయం చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న బలగం మొగులయ్యకు ప్రవాస భారతీయుడు సంజయ్, అతని స్నేహితులు ఆర్థిక సాయం అందించారు. కిడ్ని వ్యాధితో ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగులయ్యకు సాయం చేయాలని సంజీవ్ నిర్ణయించుకున్నారు. ఇందుకు తన స్నేహితులను కూడా ఒప్పించారు. అందరూ కలిసి 1.05 లక్షల రూపాయలను సేకరించి కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న సంజీవ్ తల్లి ఉమాదేవి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు.
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మొగిలయ్య, కుమరమ్మ దంపతులను కలిసిన ఉమాదేవి.. ఆ నగదును అందించారు. మొగులయ్య ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మొగులయ్య దంపతులకు ధైర్యం చెప్పి.. ఆయన త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. సంజీవ్, అతని స్నేహితుల ఆర్థిక సాయం పట్ల మొగులయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బలగం మొగిలయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి భరోసా కల్పించారు. మొగిలయ్య వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని.. మంచి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. వైద్యులతో మాట్లాడి మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.