తెలంగాణ

telangana

ETV Bharat / state

పీహెచ్‌డీ ప్రవేశాల రగడ, ఓయూలో ర్యాంకుల విధానంపై వ్యతిరేకత - PhD Admissions issue

PhD Admissions in Telangana విశ్వవిద్యాలయాల వారీగా పీహెచ్‌డీ ప్రవేశాలకు జారీ చేస్తున్న నోటిఫికేషన్లు ఆయా ప్రాంగణాల్లో రగడకు దారితీస్తున్నాయి. నిబంధనలపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకులు ఇచ్చి పీహెచ్‌డీ సీట్లను భర్తీ చేస్తామని ప్రకటించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.

పీహెచ్‌డీ
పీహెచ్‌డీ

By

Published : Aug 22, 2022, 9:55 AM IST

PhD Admissions in Telangana 2022 : విశ్వవిద్యాలయాల వారీగా పీహెచ్‌డీ ప్రవేశాలకు జారీ చేస్తున్న నోటిఫికేషన్లు ఆయా ప్రాంగణాల్లో రగడకు దారితీస్తున్నాయి. నిబంధనలపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓయూలో ఇంతకుముందు అర్హత పరీక్ష నిర్వహించేవారు. ఇందులో కటాఫ్‌ స్కోర్‌ నిర్ణయించేవారు. ఆ మార్కులు సాధించిన వారంతా సీట్లకు అర్హత పొందేవారు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి సీట్లు కేటాయించేవారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా ర్యాంకులు ఇచ్చి సీట్లను భర్తీ చేస్తామని ప్రకటించడంతో అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు.

మేలో కాకతీయ వర్సిటీ జారీ చేసిన ప్రవేశాల ప్రకటనపైనా అప్పట్లో వివాదం తలెత్తింది. ఈ వర్సిటీ 26 విభాగాల్లో 50 శాతం (212) సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) ఉన్న వారికి మిగిలిన 50 శాతం సీట్లను కేటగిరీ-1 కింద భర్తీ చేస్తామని ప్రకటించింది. వచ్చే నెలలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. అయిదేళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్‌కు కొత్త విద్యార్థులతో ఎలా పోటీపడగలమని.. అయిదేళ్ల క్రితం పీజీ పూర్తి చేసినవారు ప్రశ్నిస్తున్నారు. ప్రవేశ పరీక్ష వద్దని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రవేశ పరీక్షకు 70% వెయిటేజీ..ఖాళీ సీట్లలో కేటగిరీ-1 కింద 50 శాతాన్ని జేఆర్‌ఎఫ్‌ పొందిన వారికి ఇస్తామని, మిగిలిన వాటిని ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తామని ఓయూ ప్రకటించింది. ర్యాంకులు ఇచ్చి సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించింది. ప్రవేశ పరీక్షలో మార్కులకు 70 శాతం, పీజీ మార్కులు, నెట్‌/స్లెట్‌, ఎంఫిల్‌, ఇంటర్వ్యూ తదితర వాటికి (విద్యలో ప్రతిభ) 30 శాతం వెయిటేజీ ఇస్తామని ప్రకటించింది. దీన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు.

పాత విధానంలోనే అర్హత పరీక్ష నిర్వహించి సీట్లు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఓయూలో నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ ఇస్తున్న నేపథ్యంలో.. తాము కొత్తగా పీజీ పూర్తయిన వారితో ఎలా పోటీపడగలమని గతంలోనే పీజీ పూర్తయిన విద్యార్థులు వాపోతున్నారు. మరోవైపు నెట్‌/స్లెట్‌ ఉన్న తమకు సూపర్‌ న్యూమరరీ కింద సీట్లు కేటాయించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం విన్నవిస్తోంది.

పీహెచ్‌డీ ప్రవేశాల్లో జాప్యం చేసేందుకు నిబంధనలను మార్చి.. వివాదాస్పదం చేస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి ఆరోపించారు. జేఎన్‌టీయూహెచ్‌ సైతం పీహెచ్‌డీ ప్రకటన జారీకి సిద్ధమవుతోంది. ఈసారి ప్రైవేట్‌ కళాశాలల్లో పనిచేసే అర్హులైన వారికి కూడా గైడ్‌షిప్‌ ఇవ్వాలని యోచిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details