Agnipath Protests in Secunderabad: 'అగ్నిపథ్' ఆందోళనలతో దద్దరిల్లిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియామక ప్రక్రియ నిలిపివేసేంత వరకూ ఆందోళన ఆపేదిలేదంటూ తెగేసి చెప్పిన నిరసనకారులు.. రైలు పట్టాలపై బైఠాయించారు. సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు సాధారణ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు ఎంతో శ్రమించాయి. తొలుత నిరసన విరమించాలంటూ రైల్వే అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ యువకులు ససేమిరా అన్నారు. అగ్నిపథ్ రద్దుపై ఆర్మీ నియామక అధికారి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు.
10 మంది ప్రతినిధులు వస్తే.. ఆర్మీ నియామక అధికారితో మాట్లాడిస్తామని పోలీసులు తెలిపారు. దీనికి నిరసనకారులు తొలుత అంగీకరించనప్పటికీ.. చర్చోపచర్చలు.. తర్జన భర్జనల తర్వాత అంగీకరించారు. ఆర్మీ నియామక అధికారి తమ వద్దకే వచ్చి చర్చించాలని డిమాండ్ చేయగా.. శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని పోలీసులు సూచించారు. మరోసారి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా స్టేషన్ ప్రాంగణంలో పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు.
పోలీసుల అదుపులో ఆందోళనకారులు..: రైలు పట్టాలపై గంటల కొద్దీ భీష్మించుకు కూర్చున్న అభ్యర్థులు తమ డిమాండ్లపై సానుకూల స్పందన వచ్చే వరకూ కదలబోమంటూ పట్టుపట్టారు. మళ్లీ అసాధారణ పరిస్థితులు తలెత్తకుండా పోలీసు అధికారులు భారీగా మోహరించారు. ఆందోళనకారులకు స్టేషన్ నుంచి బయటకి తరలించారు. దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సికింద్రాబాద్ స్టేషన్ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. 9 గంటల సుదీర్ఘ ఉద్రిక్తతల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు షెడ్యూల్ రైళ్లను పునః ప్రారంభించారు. కాకినాడ వెళ్లే రైలు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వద్దకు చేరుకుంది.