బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచీ హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి వస్తున్నా పడకలు దొరకడం లేదు. తమ వంతు కోసం ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు కాయాల్సివస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని బ్లాక్ ఫంగస్‌కు నోడల్ కేంద్రంగా ప్రకటించింది. ప్రస్తుతం 90 పడకల వరకు నిండడంతో మరో 50 పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలవారనే వివక్ష లేకుండా అందర్నీ చేర్చుకోవాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తుండగా, పడకలు లేకపోవడం వల్లే కొందరికి కేటాయించలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు. అవసరమైతే 200 వరకు పెంచుతామని అంటున్నారు.
ఏపీలోని విజయవాడకు చెందిన నాగరాజు చికిత్స కోసం భార్యతో కలిసి ఈఎన్‌టీ ఆసుపత్రికి వచ్చాడు. ఆక్సిజన్ స్థాయి తక్కువ ఉందని, ఇక్కడ ఆ సదుపాయం లేదని చేర్చుకోలేదు. మూడు రోజుల నుంచి ఇక్కడే గడుపుతున్నామని ఆయన భార్య వాపోయారు. గాంధీ ఆసుపత్రికి వెళ్దామంటే కరోనా నెగెటివ్ ఉండటంతో అక్కడా చేర్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన మరికొందరు బాధితులు కూడా ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. కేటాయించిన పడకలు నిండిపోయాయని వైద్యులు చెబుతుండగా, తమకంటే వెనుక వచ్చిన వారిని చేర్చుకున్నారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు దొరుకుతాయని ఇక్కడకు వస్తే.. ఇక్కడా చేర్చుకోవడం లేదని, తాము ఇంక ఎక్కడకు పోవాలని కన్నీరుమున్నీరవుతున్నారు.
పరీక్షలకు ఉస్మానియాకు..
ఈఎన్‌టీ వైద్యశాలలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం సీటీస్కాన్ పనిచేయడం లేదు. ఫంగస్ ముఖ భాగంలో ఎక్కడెక్కడ వ్యాపించిందనేది గుర్తించడం కష్టమే. ఫంగస్ మెదడులోకి విస్తరించిందో లేదో తెలుసుకోవాలంటే బ్రెయిన్ ఎం.ఆర్.ఐ., మరికొన్ని ఇతర పరీక్షలు అవసరమవుతాయి. ఇవేమీ ఈఎన్‌టీ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులను ఉస్మానియా ఆసుపత్రికి పంపుతున్నారు. అక్కడ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.