No financial support to Telangana from Central Government: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో, రాష్ట్ర ప్రభుత్వానికి లక్షా 9 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ నెలాఖరు వరకు పన్ను ఆదాయం 92 వేల 66 కోట్లు సర్కార్ ఖజానాకు జమ అయింది.
No additional grant to Telangana from Central Government : బడ్జెట్ అంచనా వేసిన లక్షా 26 వేల 606 కోట్లలో, డిసెంబరు నెలాఖరు వచ్చిన రాబడి 72.72 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు వచ్చిన పన్ను ఆదాయం 74 వేల 496 కోట్లు రాగా, ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు వరకు 18,110 కోట్లు అదనంగా వచ్చింది. డిసెంబర్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా 31 వేల 59 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా 10 వేల 713 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 22 వేల 169కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా 13 వేల 188 కోట్లు వచ్చాయి.
State Finances: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 8 వేల 381 కోట్లు, ఇతర పన్నుల రూపంలో 6 వేల 553 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయం ఈ ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ నెలలోనే అధికంగా సమకూరింది. ఇప్పటి వరకు నెలవారీ పన్ను ఆదాయం 10 వేల కోట్ల మార్కుపై ఉండగా, డిసెంబర్‌లో మాత్రం 11 వేల 213 కోట్ల మేర పన్ను ఆదాయం వచ్చింది. పన్నేతర ఆదాయం అంచనాల్లో 39 శాతం మేర అంటే 9 వేల 962 కోట్లు వచ్చింది.
కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లలో వచ్చింది చాలా తక్కువే. 41 వేల కోటి రూపాయల గ్రాంట్లు అంచనా వేయగా, అందులో కేవలం 19 శాతం మేర 7 వేల 770 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి ఆశించిన మేర గ్రాంట్లు రాకపోవడంతో, కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతోనే సర్దుకోవాల్సి వచ్చింది. రుణ పరిమితిలోనూ కోత విధించడంతో, ఆ ప్రభావం కూడా పడింది.