తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్లంలో నీళ్లు... కళ్లలో దుఃఖం - ఏపీ తాజా వార్తలు

నివర్‌ తుపాను మిగిల్చిన నష్టాన్ని చూసి రైతులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. నీటోలోనే తేలుతున్న పైరులు, మొలకలొచ్చిన ధాన్యం చూసి కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

floods
కల్లంలో నీళ్లు... కళ్లలో దుఃఖం

By

Published : Nov 30, 2020, 10:10 AM IST

కల్లంలో నీళ్లు... కళ్లలో దుఃఖం

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా సంగం, ఏఎస్ పేట మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల్లో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి... సౌకర్యాల గురించి ఆరా తీశారు. సంగం బ్యారేజీ వద్ద జలవనరులశాఖ అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలకు జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని బోరు పంపు నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి.

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మేడికొండూరు మండలం జంగం గుంట్లపాలెంలో.. దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే శ్రీదేవి పరిశీలించారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి, నగరం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌...డ్రైనేజీ కాలువల్లో పూడిక తీయకపోవడం వల్లే వరద నీరు పంటలను ముంచెత్తిందని ఆరోపించారు. పెదకాకాని మండలంలో పర్యటించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర... పొలాల్లో నేలకొరిగిన వరిపంటలను పరిశీలించారు. గుంటూరు జిల్లాలో లక్ష 30 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. కోత కోసిన పంట పొలాల్లోనే ఉండిపోవటంతో పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో పర్యటించిన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌... నష్టపోయిన రైతులను పరామర్శించారు. డ్రైనేజీ మరమ్మతులు చేస్తే వరద ఉద్ధృతి తగ్గేదని ప్రభుత్వానికి సూచించారు. చల్లపల్లి మండలం, పాగోలులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గద్వాల కృష్ణ భౌతిక కాయానికి బుద్ధప్రసాద్ నివాళులర్పించారు. కోడూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌ ఇంతియాజ్‌... ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు పంట నష్టం నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు.

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చిననందిపాడులో .. తీవ్రంగా దెబ్బతిన్న మిరప పంటలను.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలసి పరిశీలించారు. పూర్తి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చంద్రశేఖరపురం మండలం భైరవకోనలోని దేవాలయాలకు వెళ్లే మార్గాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండరాళ్లు పడి రోడ్డు ప్రమాదకరంగా ఉండటంతో... ప్రజలకు ప్రవేశాలు నిలిపేశారు. వరుస విపత్తులతో కోనసీమ రైతులు తీవ్రంగా నష్టపోయారని... మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఖరీఫ్‌, రబీ పంటలు వర్షార్పణం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పర్యటించిన తెలుగుదేశం నేత జ్యోతుల నెహ్రూ... నీటమునిగిన వరి పంటను పరిశీలించారు. ఎకరాకు 20 వేల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:లబ్‌... డబ్‌... లబ్‌... డబ్‌... కేవలం 24 గంటలే!

ABOUT THE AUTHOR

...view details