నివర్ తుపాను పుదిచ్చేరి సమీపంలో తీరం దాటినా... ఆంధ్రప్రదేశ్లో అంచనాలకు మించి తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా రైతులను నట్టేట ముంచింది. గుంటూరు జిల్లాలో 34 మండలాల పరిధిలో 3 లక్షల ఎకరాలకు పైగా వరి పైరు దెబ్బతింది. వర్షానికి పొలాల్లో నీరు నిలబడింది. పంట సగం కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఎకరాకు 20వేల రూపాయల మేర పెట్టుబడులు పెట్టామని... కనీసం పదోవంతైనా చేతికిరాదని నిరాశలో కూరుకుపోయారు. గుంటూరు జిల్లాలో 3 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. మినప, పెసర, పంటలూ వందల ఎకరాల్లోదెబ్బతిన్నాయి. మంగళగిరి మండలంలో నీటమునిగిన పంటలను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్‌యార్డ్‌కు పత్తి విక్రయించేందుకు తీసుకొచ్చిన రైతుల పరిస్థితి.. అగమ్యగోచరంగా తయారైంది. రెండు రోజులుగా వానకు తడిసి పోతుండటంతో … రైతులు యార్డులోనే పడిగాపులు పడాల్సివస్తుంది.
ఆగిన రైతు గుండె
వర్షాలకు ప్రకాశం జిల్లాలోనూ పంట వర్షార్పణమైంది. సుమారు లక్ష హెక్టార్లలో ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. 11 తీర మండలాల పరిధిలో అధికంగా దెబ్బతిన్నాయి. అరటి,బొప్పాయి వంటి ఉద్యాన తోటలు నేలకొరిగాయి. కంది, మినుము, పొగాకు పంటలు నీటిలో నానుతున్నాయి. కనిగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. ఇంకొల్లు మండలం భీమవరంలో పెద్ద యోగయ్య అనే రైతు మృతిచెందాడు. నీటమునిగిన మిర్చి పంటను చూసి గుండెపోటుకు గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.