Debt Burden Increasing In Telangana: తెలంగాణ రాష్ట్రంపై గత అయిదేళ్లుగా అప్పులభారం గణనీయంగా పెరుగుతోందని, 2022 ఏడాదికి రూ.3,12,191 కోట్లకు చేరిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో తెలిపారు. అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తి 2016-17లో 20.47 శాతం ఉండగా.. 2020-21లో 28.11 శాతానికి చేరిందని పేర్కొన్నారు. 2021 మార్చి నాటికి బడ్జెటేతర అప్పులు రూ.97,940.45 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ నిష్పత్తి 38.10 శాతానికి చేరుకుంటుందని.. ఇది 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానంలోని లక్ష్యం కన్నా ఎక్కువ అని వివరించారు.
శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆమె నోట్ అందించారు. ‘‘శ్రీలంక సంక్షోభం తరువాత రాష్ట్రాల ఆర్థిక నష్టాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఉచితాలపై పెరుగుతున్న ఖర్చులతో కొత్త సవాళ్లు, అప్పులు పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో రాయితీల కోసం చేసిన ఖర్చులో తొలి అయిదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. తెలంగాణ అప్పులు జాతీయ సగటు 32.1 శాతం కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. 2015-20 వరకు వార్షిక అప్పుల పెరుగుదల రేటు అత్యధికంగా తెలంగాణలో 30.6 శాతంగా నమోదైంది. విద్యుత్తు పంపిణీ సంస్థలకు ప్రభుత్వం రూ.11,915 కోట్లు బాకీపడింది. విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల్లో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల వాటా 57 శాతంతో రూ.1,14,222 కోట్లుగా ఉంది. ఉదయ్ పథకం కింద బాండ్ల రూపంలో 2015లో తీసుకున్న రూ.8,931.51 కోట్ల అప్పుల్లో డిస్కంలకు ప్రభుత్వం రూ.7,723 కోట్లు మాత్రమే చెల్లించింది. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించడంతో మిగతా నిధుల్ని ఇచ్చింది.’’