తెలంగాణ

telangana

ETV Bharat / state

సూక్ష్మ పోషకాలతో పిల్లలకు మానసిక, శారీరక ఆరోగ్యం

సూక్ష్మ పోషకాలను వారి డైట్‌లో భాగంగా తీసుకున్న పిల్లల్లో రక్తహీనత 46 నుంచి 10 శాతానికి తగ్గినట్లు ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌, యూనివర్సిటీ ఆఫ్ మ్యారీల్యాండ్ పరిశోధకుల బృందం గుర్తించింది. పిల్లల ఐక్యూతో పాటు శారీరక, మానసిక వికాసం గణనీయంగా పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. నల్గొండలోని 22 అంగన్వాడీలపై 8 నెలలపాటు జరిపిన పరిశోధనలే ఇందుకు నిదర్శనం అంటున్నారు పరిశోధకులు.

ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌, పిల్లల్లో రక్తహీనత
nin and icmr study, child anemia

By

Published : May 20, 2021, 1:50 PM IST

విటమిన్లతో కూడిన సూక్ష్మ పోషకాలు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని తాజా సర్వే ఒకటి నిగ్గు తేల్చింది. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌, యూనివర్సిటీ ఆఫ్ మ్యారీల్యాండ్ సంయుక్తంగా చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలను ఎన్‌ఐఎన్‌ వెల్లడించింది. నల్గొండలోని 22 అంగన్వాడీలపై 8 నెలలపాటు పరిశోధన జరిపి ఈ వివరాలు వెల్లడించింది.

రక్తహీనత తగ్గింది..

అంగన్వాడీల్లోని 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను రెండు గ్రూపులుగా విభజించారు. అందులో ఒక గ్రూపునకు పిల్లల మధ్యాహ్న భోజనంలో భాగంగా విటమిన్ ఏ, సీ, బీ12, బీ2, ఫోలిక్ ఆసిడ్, ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలను ఇచ్చి ఆ ఫలితాలను 8 నెలల పాటు పరిశీలించారు. మరో గ్రూపు పిల్లలకు రెగ్యులర్ అంగన్వాడీ భోజనాన్నే అందించారు. ఎనిమిది నెలల తర్వాత ఫలితాలను విశ్లేషిస్తే.. సూక్ష్మ పోషకాలను వారి డైట్‌లో భాగంగా అదనంగా తీసుకున్న పిల్లల్లో రక్తహీనత 46 నుంచి 10 శాతానికి తగ్గినట్లు పరిశోధకుల బృందం గుర్తించింది. సూక్ష్మ పోషకాలు అందని పిల్లలో రక్తహీనత 47 నుంచి 35 శాతానికే పరిమితం అయినట్లు వెల్లడించింది. ఈ సూక్ష్మ పోషకాలను తీసుకున్న పిల్లల్లో రక్తహీనత మెరుగవటమే కాక, వారి మానసిక వికాసం కూడా గణనీయంగా ఉందని ఫలితాల్లో వెల్లడైంది. పిల్లల ఐక్యూతో పాటు శారీరకంగా, మానసికంగా వికాసం పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు.

పోషకాల లేమితో..

దేశవ్యాప్తంగా ప్రీస్కూల్ పిల్లలకు సూక్ష్మ పోషకాలు సరిగ్గా అందివ్వడం వల్ల వారు శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ సైల్వా ఎఫ్.రావు అన్నారు. పిల్లల అభ్యసనా నైపుణ్యాలు మెరుగవుతాయన్నారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో రక్తహీనత దేశవ్యాప్తంగా ఉందని.. సరైన పోషణ లేక, ఐరన్ , జింక్ వంటి ఇతర పోషకాల లేమితో ఈ సమస్య ఉత్పన్నమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా ఉన్న సమగ్ర మాతాశిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆ లోటును భర్తీ చేయొచ్చన్నారు. సూక్ష్మ పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించినట్లయితే పిల్లలు రక్తహీనత వంటి సమస్యలనుంచి బయటపడతారని.. తద్వారా వారి యవ్వనం రక్తహీనత లేని వసంతంగా నిలుస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

ఇదీ చూడండి:'ప్రాథమిక దశలో గుర్తిస్తే.. బ్లాక్ ఫంగస్​ నుంచి కోలుకోవచ్చు'

ABOUT THE AUTHOR

...view details