Nigerian Drug Dealers Hyderabad :ముంబయి, దిల్లీ, హైదరాబాద్, గోవా, చెన్నై, బెంగళూరు.. ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా.. వాటి వెనుక ఉండేది నైజీరియన్లే. నేరుగా లేదా ఇతరుల ద్వారా హెరాయిన్, కొకైన్ సరఫరా చేస్తూ.. భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఉన్న దేశంలో ఉపాధి లేకపోవడంతో విద్య, వ్యాపార, ఆరోగ్య సమస్యల పేరుతో ఆఫ్రికన్లు మన దేశానికి వస్తున్నారు. గడువుతో కూడిన వీసాలు తీసుకువచ్చి దేశంలోని పలు నగరాల్లో స్థిరపడుతున్నారు. వీసా గడువు ముగిసినా సొంత దేశానికి వెళ్లకుండా ఇక్కడే తిష్ఠవేసి.. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
Nigerians Supply Drugs in Hyderabad :నార్కోటిక్ విభాగం పోలీసులకు ఇటీవల చిక్కిన నైజరీయన్లందరూ వీసా గడువు దాటినా.. అక్రమంగా బెంగళూరు, ముంబయి, దిల్లీ, గోవాలో నివాసం ఉంటున్నట్లు తేలింది. నేరుగామాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే పోలీసులకు దొరికిపోతున్నామని.. నైజీరియన్లు డార్క్ వెబ్‌ను ఎంచుకున్నారు. డ్రగ్స్ సరఫరాకు ఇతరులను ఎంపిక చేసుకుంటున్నారు. సూడాన్, ఘనా, ఐవరీకోస్ట్‌లకు చెందిన యువతీ యువకులను ఎంపిక చేసుకొని.. వాళ్ల ద్వారా నైజీరియన్లు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఖరీదైనమాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే గ్రాముకు రూ.2 వేల వరకు చెల్లిస్తున్నారు. ఒకవేళ వాళ్లు పోలీసులకు దొరికితే.. అసలు వ్యక్తులెవరు అనే విషయాలను బయటపెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల కాచిగూడలో సూడాన్‌కు చెందిన యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ చెబితే బెంగళూర్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు ఆమె పోలీసులకు తెలిపింది.
Nigerian gang Arrested in Hyderabad : నైజీరియన్లు తమ దేశం నుంచి కాకుండా సమీప దేశాలైన ఐవరీ కోస్టు, ఘనా నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాస్ పోర్టు, వీసా తీసుకొని భారత్‌కు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్ని పట్టుకున్న సమయంలో.. తిరిగి వాళ్లను వాళ్ల దేశానికి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుల పాస్ పోర్టు, వీసాలు ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు పంపించినప్పుడు.. తమ దేశస్థులు కారని రాయబార కార్యాలయ అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులకు చిక్కులు ఎదురవుతున్నాయి.