NIA Searches PFI Case In Hyderabad: పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ అధికారులు మరోసారి రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని చాంద్రాయణగుట్ట పీఎఫ్ఐ కార్యాలయం.. ఎల్బీనగర్, ఆటోనగర్‌లోని ఓ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే చాంద్రాయణగుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. మరోవైపు కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. పీఎఫ్ఐ మాజీ కార్యకర్త కోసం ఆరా తీసిన ఎన్ఐఏ అధికారులు.. పరారీలో ఉన్న కార్యకర్త కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
దేశవ్యాప్తంగా సోదాలు..: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, కేరళ సహా దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తుల నివాసాల్లో దాడులు చేసి.. దేశవ్యాప్తంగా 100 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి పలువురు పీఎఫ్ఐకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది.