కరోనా ఎఫెక్ట్: నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు కొత్త ఏడాది అంటేనే పార్టీలు, చిందులు, హంగులు, ఆర్భాటాలు. కానీ ఈసారి అలాంటి సంప్రదాయాలకు ప్రజలు దూరంగా ఉంటూ సాధారణంగానే 2021కి స్వాగతం పలికారు. కొవిడ్ ఆంక్షలతో బహిరంగ వేడుకల నిషిద్ధం కారణంగా ప్రజలు ఇళ్లల్లోనే జరుపుకున్నారు. కేకులు, బాణసంచా వెలుగులతో ఇళ్ల వద్దే కొత్త ఏడాదిని ఆహ్వానించారు.
శుభాకాంక్షల వెల్లువ
నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఏటా రాజ్ భవన్‌లో నిర్వహించే ఓపెన్ హౌస్‌ను కొవిడ్ దృష్ట్యా రద్దు చేశారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా తమిళిసైకి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో గులాబీ శ్రేణులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు మంత్రిని కలిశారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. 2021లో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
సంబురాల్లో పోలీసు బాసులు
పోలీస్ ఆఫీసర్స్ మెస్ ఆవరణలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో డీజీపీ మహేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనిశా డీజీ పూర్ణచంద్రారావు, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని రూపొందించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కార్ఖానాలోని వృద్ధాశ్రమంలో కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్న సజ్జనార్... వృద్ధురాలితో కేక్ కట్ చేయించి... అల్పాహారం, మిఠాయిలు అందించారు.
కిటకిటలాడిన దేవాలయాలు
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు కిటకిటలాడాయి. కొత్త ఏడాదిలో ప్రారంభించే పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని పూజలు చేశారు. యాదాద్రి, వరంగల్ వేయి స్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం వేళ ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారి నుంచి పూలబోకేలు, స్వీట్లకు బదులుగా నోటుపుస్తకాలు, పెన్నులు స్వీకరించారు. వాటిని పేద పిల్లలకు పంచిపెడతామని కలెక్టర్ స్పష్టంచేశారు. ఖమ్మంలో నూతన సంవత్సర వేడుకలు కళ తప్పాయి. మిఠాయి దుకాణాలు, బిర్యానీ పాయింట్ల వద్ద జనసంచారం కనిపించింది.
ఇదీ చదవండి:రేపు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు