Civil Assistant Surgeons Recruitment: గతంలో వైద్యుల నియామకాల్లో అనుసరించిన విధానాల వల్ల పలు సమస్యలు వచ్చినందున.. ఈ దఫా సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో నూతన విధానాన్ని అమలు చేయాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. నాలుగేళ్ల కిందట వైద్య విధానపరిషత్ పరిధిలో అభ్యర్థుల ప్రాధాన్యాలను పట్టించుకోకుండా.. ఇష్టానుసారం పోస్టింగ్‌లు ఇవ్వడంతో ఎక్కువ మంది వైద్యులు విధుల్లో చేరలేదు. దీంతో ఈసారి ఎంబీబీఎస్ అర్హతతో నియమితులయ్యే వైద్యులకు వారికి నచ్చినచోట పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయానికొచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ తుది దశకు చేరుకోవడంతో వాటిపై తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 969 పోస్టులకు చెందిన తుది జాబితాను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ ప్రభుత్వానికి మూణ్నాలుగు రోజుల్లో అందజేయనుంది.