New Police Stations in Hyderabad: విస్తీర్ణం, జనాభా, కేసుల సంఖ్య ఆధారంగా గతంలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దశాబ్దాల క్రితం ప్రారంభమైన పోలీస్ స్టేషన్ల పరిధిలో జనసాంద్రత పెరిగిపోయింది. దీంతో ఫిర్యాదులు, కేసుల సంఖ్య సైతం ఎక్కువైపోయాయి. రాజకీయ కార్యక్రమాలకు ప్రాధాన్యత పెరగడంతో... నేతల బందోబస్తులకే పోలీసులు అధిక సమయం కేటాయించాల్సి వస్తోంది. అంతే కాకుండా ముట్టడిలు, ధర్నాలు, రాస్తారోకోలు జరగకుండా చూడటం పోలీసుల విధుల్లో నిత్యం ఉంటుంది.
శాంతి భద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు: ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు అదనపు పనిభారం.. మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మహానగర పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జోన్లకు డీసీపీలను కేటాయించారు. జోన్లలో డివిజన్లు, పోలీస్ స్టేషన్లను సైతం ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శాంతి భద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
వీలైనంత త్వరలో పోలీస్ స్టేషన్ల ప్రారంభం: ఇప్పటికే ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. మిగతా పోలీస్ స్టేషన్లకు భవనాలు సిద్ధం చేసి వీలైనంత త్వరలో ప్రారంభించనున్నారు. సొంత భవనాలు లేనిచోట అద్దె భవనాలు లేదా.. ఇతర ప్రభుత్వ భవనాల్లో నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పలు డివిజన్లు: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పలు డివిజన్లు.. పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. మధ్య మండల పరిధిలో గాంధీనగర్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. దీని పరిధిలో దోమలగూడ, లేక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. సైఫాబాద్ డివిజన్ పరిధిలో ఖైరతాబాద్ పీఎస్ అందుబాటులోకి రానుంది. తూర్పు మండల పరిధిలో చిలకలగూడ, ఉస్మానియా యూనివర్శిటీ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
చిలకలగూడ డివిజన్ పరిధిలో వారాసిగూడ పీఎస్ నూతనంగా ఏర్పాటు కానుంది. ఉత్తర మండల పరిధిలో బేగంపేట డివిజన్ పరిధిలో తాడ్బన్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. తిరుమలగిరి డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా ఏర్పాటైన దక్షిణ తూర్పు మండల పరిధిలో.. చాంద్రాయణ గుట్ట, సైదాబాద్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. బండ్లగూడ, ఐఎస్‌సదన్ పీఎస్ అదనంగా అందుబాటులో రానున్నాయి.