తెలంగాణ

telangana

ETV Bharat / state

వనయాత్రకు చలో... నగరాలకు చేరువలో కొత్త ఉద్యానవనాలు - parks closer to the cities

పోటీ ప్రపంచం, ఉరుకుల పరుగుల జీవితం, కమ్ముకొస్తున్న కాలుష్యం... వీటి నుంచి కొంచెం దూరంగా వెళ్లి గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలని ఉందా? ప్రకృతి ఒడిలో పరవశించాలనుకుంటున్నారా? అందుకోసం సుదూర ప్రాంతాల్లోని అడవులకు వెళ్లనక్కరలేదు. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలకు చేరువలోని అనేక అటవీ ప్రాంతాలే ఆహ్లాదకర ఉద్యానాలుగా మారుతున్నాయి. సందర్శకులకు స్వచ్ఛమైన ప్రాణవాయువును పంచుతున్నాయి. కాస్త ఖాళీ చేసుకుంటే చాలు.. అక్కడ ఆరోగ్యానికి, ఆనందానికి ఆకాశమే హద్దు. ఆధునిక జీవనశైలి నుంచి ఉపశమనం కలిగించేలా అటవీశాఖ రూపుదిద్దిన అలాంటి వనాలకు యాత్ర చేద్దాం పదండి.

వనయాత్రకు చలో... నగరాలకు చేరువలో కొత్త ఉద్యానవనాలు
వనయాత్రకు చలో... నగరాలకు చేరువలో కొత్త ఉద్యానవనాలు

By

Published : Jan 10, 2021, 6:38 AM IST

ఊపిరిలూదే ఉద్యానాలు!

వారాంతాలు, సెలవురోజుల్లో సేదతీరేందుకు రిసార్టులకు, బెంగళూరు వంటి దూరప్రాంతాలకు వెళ్లే నగరవాసుల పంథాలో కొంత మార్పు కనిపిస్తోంది. ఈ తరహా ఉల్లాసానికి వ్యయప్రయాసలు తప్పవు. రిసార్టుల్లో కొంతమేరే పచ్చదనం ఉంటుంది. పట్టణాలకు చేరువగా అటవీశాఖ కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఉద్యానవనాలు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి.. అనేక సౌకర్యాలు, నామమాత్రపు ప్రవేశరుసుం తప్ప ఖర్చు లేకపోవడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది. ‘అర్బన్‌ లంగ్స్‌’ పేరుతో అందులో అడవుల్లోని కొంత ప్రాంతాన్ని అటవీశాఖ అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తోంది.

పట్టణ ఉద్యానవనం(అర్బన్‌ ఫారెస్ట్‌పార్క్‌) అంటే ఏదో పార్కులా చెట్లు, వాటి మధ్యలో నడిచేందుకు ఓ దారికి మాత్రమే పరిమితం కావట్లేదు. అడవిలో అడుగుపెడితే చాలు.. పిల్లలకు ఆటస్థలం, యువకులకు రాక్‌ క్లైంబింగ్‌, ఎత్తునున్న తీగకు వేలాడుతూ వెళ్లే సాహసక్రీడలు..పెద్దలకు యోగా ఏర్పాట్లు.. అడవిలో రాత్రి బసకు గుడారాలు, నచ్చిన ఆహారం వండుకునేందుకు వసతులు.

అడవి అంతా చుట్టేసి రావడానికి ఆధునిక సైకిళ్లు.. బంధుమిత్రులతో వనభోజనాలు చేసుకునే ఏర్పాట్లతో ఈ అటవీ ఉద్యానవనాలు ఆకర్షిస్తున్నాయి. ఒక్కో పార్కులో ఒక్కో ప్రత్యేకత. హైదరాబాద్‌, శివారు ప్రాంతాలతో పాటు ఖమ్మం, కాళేశ్వరం, మహబూబ్‌నగర్‌, చౌటుప్పల్‌, మంచిర్యాల, తాడ్వాయి, యాదాద్రి.. వంటి పట్టణాల సమీపంలో అటవీప్రాంతాలు ఉద్యానాలుగా రూపుదిద్దుకొని అదనపు హంగులతో అలరిస్తున్నాయి.

ఐటీ.. అడవి.. ఆధునిక సైకిళ్లు

హైదరాబాద్‌ ఐటీ కేంద్రం కొండాపూర్‌ పక్కనే కొత్తగూడలో పాలపిట్ట పార్క్‌కి వెళితే పచ్చని చెట్లతో ఆహ్లాదమే కాదు..సైక్లింగ్‌కు 2.9 కి.మీ. ప్రత్యేక ట్రాక్‌ ఉందిక్కడ. అడవిలో సైక్లింగ్‌ కోసం 350 ఆధునిక సైకిళ్లు అందుబాటులో ఉన్నాయక్కడ. వీటిని అద్దెకు తీసుకుని ఎంచక్కా అడవంతా చుట్టేసి రావచ్చు. ఏపీలోని కడియం నర్సరీల నుంచి తెచ్చి పెంచిన 2వేల ఎత్తైన మొక్కలూ ఈ పార్కులో మరో ఆకర్షణ.

సమావేశాలు పెట్టుకోవచ్చు

1,732 హెక్టార్ల ప్రాంతం..ఎటుచూసినా పచ్చదనం నర్సాపూర్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ ప్రత్యేకం. అడవిలో ట్రెక్కింగ్‌, రాత్రి బసకు కాటేజీలు, సమావేశాలు, సదస్సులు పెట్టుకునేందుకు కాన్ఫరెన్స్‌ హాల్‌..పక్షిప్రేమికులకు, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.

దూరమైనవారి ‘నీడ’లో

భౌతికంగా దూరమైన కుటుంబసభ్యులు, ఆప్తుల్ని యాది చేసుకునేందుకు వారి పేరుతో మొక్కలు నాటొచ్చు. చౌటుప్పల్‌ స్మృతివనం, కాళేశ్వరంలోని ముక్తివనం, కొత్తగూడ పాలపిట్ట పార్కులో ఇలాంటి అవకాశం ఉంది. సమయం దొరికినప్పుడు వెళ్లి ఆ చెట్టు నీడన కూర్చోవచ్చు. రూ.5వేలు చెల్లిస్తే నాటిన మొక్క చెట్టుగా పెరిగే వరకు అటవీశాఖ బాధ్యత తీసుకుంటుంది.

సహజ అడవి.. సాహసక్రీడలు

పెద్దగోల్కొండ ఔటర్‌ కూడలికి సమీపంలోని ‘మస్‌జీద్‌గడ్డ జంగిల్‌ క్యాంప్‌’ అనేక సాహస క్రీడలకు ప్రత్యేకం. రోజంతా గడపొచ్చు. రాత్రి బసకు 15 గుడారాలు ఉన్నాయి. 180 హెక్టార్ల అటవీప్రాంతం. 4.5 కి.మీ. సైక్లింగ్‌ ట్రాక్‌, 5.6 కి.మీ. నడకదారి, క్రీడా మైదానంతో పాటు రాక్‌ క్లైంబింగ్‌, తాళ్లతో కట్టిన ఉయ్యాలపై నడక, విలువిద్య, ఆకాశంలో తాడుకు వేలాడుతూ 150 మీటర్ల దూరం వరకు వెళ్లడం వంటి అనేక సాహసక్రీడలకు కేంద్రమిది. ప్రత్యేక ఏర్పాట్లతో త్వరలో అందుబాటులోకి రానుంది.

చలిమంటలు.. గుడారం.. ఎడ్లబండి

ఓ రోజంతా దట్టమైన అడవిలో ఉండాలంటే.. సాయంత్రం చలిమంటలు వేసుకుని, రాత్రి గుడారంలో పడుకుని, ఉదయం లేచి ట్రెక్కింగ్‌ చేసుకుంటూ వెళితే.. రకరకాల పక్షుల్ని చూసివస్తే.. అంతకంటే ఆనందం ఏముంటుంది? జింకల అందాల్ని తిలకిస్తూ..సైకిల్‌ తొక్కుతూ.. తర్వాత ఎడ్లబండిపై తిరిగివస్తే.. చెరువులో బోటింగ్‌ చేస్తే.. మజానే. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం లక్నవరం రిజర్వు ఫారెస్టు.

ఔటర్‌లో ‘ఆక్సిజన్‌’ పార్కు

కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కు ప్రకృతి అద్భుతం. వినోద, విజ్ఞానవనం. 75 ఎకరాల విస్తీర్ణం.. పాతిక రకాల్లో 50వేల పైచిలుకు చెట్లు. పక్కనే 450 ఎకరాల్లో రక్షిత అటవీప్రాంతం. యోగా హాల్‌, వాక్‌వే, పిల్లలకు ఆటస్థలం.. వారాంతాల్లో వనభోజనాలకు ఏర్పాట్లు ఉన్నాయిక్కడ. అడుగుపెట్టగానే స్వాగతం పలికే పచ్చని చెట్లు.. వాటి మధ్యలోంచి నడక దారి..అలా కొంచెం ముందుకు వెళితే..ఓ పెద్ద మర్రిచెట్టు. దాని కింద తరగతి గది. ఇంకొంచెం ముందుకెళితే గుబురు చెట్లు, వాటి కొమ్మల మధ్యలో 10 అడుగుల ఎత్తులోంచి.. 220 మీటర్ల దూరం మేర నడిచి వెళ్లేందుకు కెనాపీ వాక్‌వే.. కుటుంబసమేతంగా విశ్రాంతికి ప్రత్యేకంగా కుటీరం. భోజనాలు చేసేందుకు డైనింగ్‌ టేబుల్‌ తరహాలో ఏర్పాట్లున్నాయి.

‘శ్వాస’ కొత్తగా.. సరికొత్తగా

సూరారంలో 38 ఎకరాల్లో ‘శ్వాస’.. గాజులరామారంలో 65 ఎకరాల్లో ‘ప్రాణవాయువు. 5.5 కి.మీ. సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌, అటవీ అందాల వీక్షణకు వాచ్‌టవర్‌.. ఒక్కోచోట వంద రకాల పూలు, పండ్లు, ఔషధ రకాల మొక్కలతో ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్నాయీ ఉద్యానవనాలు. పక్కపక్కనే ఉండటంతో ఒక పార్కులోంచి మరో దాంట్లోకి ఇట్టే వెళ్లొచ్చు.

* సిద్దిపేట జిల్లాలో 204 హెక్టార్లలో తేజోవనం(మర్‌పెడగ) ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అటవీ అందాల వీక్షణకు వాచ్‌టవర్‌, యోగా కేంద్రం. సమావేశ, భోజన మందిరాలు. చక్కటి పచ్చికబయళ్ల మధ్య సేదతీరే ఏర్పాట్లు. 117 హెక్టార్లలో కల్పకవనం(సంగాపూర్‌) నిర్మాణం పూర్తయ్యింది. ప్రకృతి ప్రేమికులకు అద్భుత ప్రదేశం ఇది. చిట్టడివిని తలపించేలా 10వేల మొక్కలతో మియావాకీ ప్లాంటేషన్‌ ఉందిక్కడ. వీటితో పాటు బీబీనగర్‌, తుర్కపల్లి, మనోహరాబాద్‌, పెద్దఅంబర్‌పేట, కొంగమడుగు, శ్రీనగర్‌ పడమటికంచె సహా మొత్తం 22 కొత్త అటవీ ఉద్యానవనాలు నెలాఖరుకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

నెమళ్లు, నీటిపక్షులు

మంచిర్యాల గాంధారివనం వెళితే చుక్కలదుప్పి, అడవిపంది, పాములు, నెమళ్లు, నీటిపక్షులనూ చూడొచ్చు. చెరువులో బోటింగ్‌ చేయొచ్చు.

అందుబాటులోని అటవీ ఉద్యానవనాల్లో మరికొన్ని..

  • భాగ్యనగర్‌
  • నందనవనం
  • నారపల్లి
  • (ఉప్పల్‌కి చేరువలో)
  • శాంతివనం
  • మేడిపల్లి
  • ప్రశాంతివనం, ఆయుష్‌వనం,
  • కార్తీకవనం
  • దూలపల్లి
  • రాచకొండ ఫోర్ట్‌ ఫారెస్ట్‌పార్క్‌
  • రాచకొండ
  • తాడ్వాయి హట్స్‌
  • తాడ్వాయి
  • ఆరోగ్యవనం
  • నాగారం
  • తంగేడువనం
  • లక్కారం (చౌటుప్పల్‌)
  • నర్సింహవనం
  • రాయగిరి
  • మృగవని నేషనల్‌ పార్క్‌
  • చిలుకూరు
  • మహావీర్‌ హరిణవనస్థలి హయత్‌నగర్‌
  • ప్రకృతివనం వనపర్తి
  • పాండవుల గుట్ట
  • జకారం (భూపాల్‌పల్లి)
  • పాకాల బయోడైవర్సిటీ పార్క్‌
  • పాకాల
  • కీసర అరణ్యం
  • కీసర
  • స్మృతివనం
  • చౌటుప్పల్‌
  • గండి రామన్న హరితవనం - చించొలి(నిర్మల్‌)

అడవిని కాపాడుతూ.. ఆహ్లాదం పంచుతూ

పట్టణ అటవీపార్కుల్ని విభిన్నంగా, పర్యావరణ ప్రాధాన్యం తెలిసేలా తీర్చిదిద్దుతున్నాం. ఆక్రమణల నుంచి అడవిని కాపాడుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడం మా ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా 95 అటవీ పార్కుల ఏర్పాటు మా లక్ష్యం. ఇప్పటివరకు 40 అందుబాటులోకి వచ్చాయి.

- ఆర్‌.ఎం.దోబ్రియాల్‌, అటవీ సంరక్షణ ప్రధానాధికారి (సోషల్‌ ఫారెస్ట్రీ)

ఇవీ చూడండి:నీటిలో నానబెడితే చాలు అన్నం రెడీ.. ఆ 'మ్యాజిక్​' ఎంటో​ తెలుసా?

ABOUT THE AUTHOR

...view details