తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్: యావత్ దేశానికే ఆదర్శంగా మున్సిపాలిటీ చట్టం - మున్సిపోల్స్​

ప్రతి పనికీ పైసలు... అడుగడుగునా అవినీతి...అడ్డగోలుగా అక్రమాలు... అన్నింటికీ మించిన నిర్లక్ష్యం...ఇవన్నీ పురపాలక సంఘాల్లో నిత్యకృత్యం. అందుకే..మున్సిపాలిటీలను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం...కొత్త పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. యావత్‌దేశానికి ఆదర్శంగా నిలిచేలా...పట్టణ ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవల్ని అందించేలా ఈ చట్టం రూపుదిద్దుకుంది. పాలనలో భాగస్వాములయ్యేలా ప్రజా ప్రతినిధులకు ఈ చట్టం ద్వారా ప్రత్యేక విధులు, బాధ్యతలు అప్పగించారు. బాధ్యతల్లో అలక్ష్యంగా వ్యవహరించినా...నిర్లక్ష్యంగా ఉన్నా.. ఏకంగా పదవులు కోల్పోయే ప్రమాదముంది. పురపాలిక ఎన్నికల వేళ ఈ చట్టంలోని అంశాలను ఓసారి అవలోకిద్దాం.

NEW MUNICIPAL ACT EXPLAINED IN DETAIL
NEW MUNICIPAL ACT EXPLAINED IN DETAIL

By

Published : Jan 9, 2020, 2:40 PM IST

Updated : Jan 10, 2020, 3:02 PM IST

యావత్ దేశానికే ఆదర్శంగా మున్సిపాలిటీ చట్టం

ప్రగతికి పట్టం కట్టడమే లక్ష్యంగా కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నూతన పురపాలక చట్టాన్ని తెచ్చింది. పురపౌరులకు సౌకర్యవంతమైన సేవలు, జవాబుదారీతనం, పట్టణప్రాంతాల్లో పచ్చదనానికి ప్రోత్సాహం, ప్రతి పట్టణానికీ బృహత్ ప్రణాళిక... తదితర అంశాల సమాహరమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజాప్రతినిధులను క్రియాశీలకం చేసేలా బాధ్యతలు, విధులు నిర్దేశించింది. కార్పోరేటర్లు, కౌన్సిలర్లు కేవలం హోదాకు కాకుండా బాధ్యతతో వ్యవహరించాలని నూతన పురపాలక చట్టం స్పష్టం చేస్తోంది.

పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి...

పురపాలక చట్టం 56వ విభాగంలో కార్పేరేటర్లు, కౌన్సిలర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డుల్లో పారిశుద్ధ్యం, నీటిసరఫరా సరిగా ఉండేలా చూడటంతో పాటు.. వీధి దీపాల నిర్వహణపై దృష్టి సారించాలి. ఇళ్లు, వ్యాపార సముదాయాల నుంచి తడి, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలి. తడి చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చటం సహా, పొడి చెత్త ప్రాసెసింగ్ కోసం చర్యలు తీసుకోవాలి. జిల్లా కార్యచరణ ప్రణాళిక నిర్ణయించిన మేరకు వార్డులో మొక్కలు నాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం బతికుండేలా చూడాలి. నీటి వృథా, నీటి నష్టాలు లేకుండా చూడటంతో పాటు..వీలైనంత వరకు బోర్లు వాడకుండా చర్యలు తీసుకోవాలి. వార్డు పరిధిలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలి. చట్టం ద్వారా ఉన్న బాధ్యతలతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు అప్పగించే బాధ్యతలను నిర్వర్తించాలని నూతన పురపాలక చట్టం చెబుతోంది.

మేయర్లు, ఛైర్మన్లకు క్రియాశీల బాధ్యతలు...

పురపాలనలో మేయర్లు, ఛైర్ పర్సన్లు సైతం అత్యంత క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. పాలకమండళ్ల సమావేశాలకు అధ్యక్ష్యత వహించనున్న మేయర్లు, ఛైర్ పర్సన్లు... పురపాలనను సాఫీగా సాగించాల్సి ఉంటుంది. ఈ మేరకు వీరి కర్తవ్యాలు, బాధ్యతల్ని పురపాలక చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. చట్టంలోని 23వ విభాగంలో వారి బాధ్యతలు పేర్కొన్నారు. ప్రతినెల ఒకసారి విధిగా పాలకమండలిని సమావేశపరచాల్సి ఉంటుంది. కౌన్సిల్ సభ్యులందరూ లేదా సగం మంది సభ్యులు లిఖితపూర్వకంగా కోరినప్పుడు కూడా పాలకమండలిని సమావేశపరచాల్సి ఉంటుంది. పట్టణంలో పారిశుధ్యం, నీటిసరఫరా మెరుగ్గా ఉండేలా చూడటంతో పాటు..వీధి దీపాలు సరిగా నిర్వహించాలి. నివాస, వాణిజ్యసముదాయాల నుంచి చెత్తను, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి వాటి సమగ్ర నిర్వహణ చేపట్టాలి.

ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేలా...

పురపాలికలో గ్రీన్ సెల్ ను ఏర్పాటు చేసి బడ్జెట్ లో పదిశాతం నిధులను కేటాయించాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించిన మేరకు పట్టణంలో నర్సరీ ఏర్పాటుచేసి మొక్కలు పెంచాలి. పట్టణంలో పచ్చదనం మెరుగ్గా ఉండేలా చెట్లను నాటి సంరక్షించాలి. సదరు మేయర్, ఛైర్ పర్సన్ ప్రాతినిథ్యం వహిస్తున్నవార్డులో కనీసం 85 శాతం మొక్కలు బతికేలా చూడాలి. పట్టణ పరిధిలోని పార్కుల అభివృద్ధి నిర్వహణతో పాటు.. జలాశయాల పరిరక్షణ కొరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను పరిరక్షించాలి. ప్రతీ ఏడాది పురపాలిక లెక్కల ముగింపు ఆడిటింగ్ చేపట్టాలి. పురపాలికకు సంబంధించిన ఆస్తులను కాపాడటంతో పాటు..ఎవరైనా ఆక్రమించుకుంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. పట్టణ పరిధిలో నీటి వృథా, నీటి నష్టాలను అరికట్టాలి. వర్షపు నీటి సంరక్షణ కోసం అవసరమైన మేర ఇంకుడు గుంతలు, ఇతర నిర్మాణాలను ప్రోత్సహిచాల్సి ఉంటుంది. పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై 24 గంటల్లోగా ఛైర్ పర్సన్లు సంతకం చేయాల్సి ఉంటుంది. కౌన్సిల్ మంజూరు లేని ఏదైనా పనిని జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొనే చేయాల్సి ఉంటుంది.

కలెక్టర్​కు కీలక అధికారాలు...

అవినీతి నిర్మూలన, జవాబుదారీతనాన్నిపెంపొందించేలా..ఏళ్ల తరబడి ఒకేచోట లేకుండా అధికారుల బదిలీ ఉండే వెసులుబాటు కొత్త చట్టంలో ఉంది. ఈ- గవర్నెన్స్‌ సాయంతో ఆన్‌లైన్‌ సేవలు అందించటం... నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయకపోతే బాధ్యుల నుంచి జరిమానా వసూలు చేసే వెసులుబాటు కల్పించారు. ఛైర్ పర్సన్, వైస్ ఛైర్‌ పర్సన్, సభ్యుడి సస్పెన్షన్, తొలగింపునకు ప్రభుత్వం లేదా జిల్లా కలెక్టరుకు అధికారాలు కట్టబెట్టారు. పురపాలన పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టరుకు ప్రత్యేక, అత్యవసర అధికారాలు కట్టబెట్టారు. దీంతో పట్టణాల్లోనూ కలెక్టర్ పాత్ర క్రియాశీలకం కానుంది.

పట్టణాలకు ప్రత్యేక ప్రణాళిక...

కొత్త పురపాలక చట్టం ప్రకారం...ప్రతి పట్టణానికి పారిశుద్ధ్య ప్రణాళిక, వందశాతం ఘన వ్యర్థాల నిర్వహణ, డంపింగ్ యార్డుల నిర్వహణ తప్పనిసరి. పట్టణ ప్రాంతాల ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్రతి పట్టణానికీ బృహత్ ప్రణాళికను చట్టంలో ప్రస్తావించారు. భూసేకరణ, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, కాలువల ప్రణాళిక, హరిత ప్రదేశాల ప్రణాళిక, ట్రాఫిక్ రవాణా ప్రణాళికలతో కలిపి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఇంకుడు గుంతలు, పారిశుద్ధ్య ప్రణాళిక, ఘణ వ్యర్థాల నిర్వహణను పొందుపర్చాల్సి ఉంటుంది. ఎవరైనా రహదారులు, కాలువలుకు నష్టం కలిగించినా... ప్రభుత్వ స్థలాల్లో ఉన్న మొక్కలకు నష్టం కలిగించినా చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా కాలుష్యాన్ని కలగజేసిన వారిపై జరిమానా విధించే అధికారాన్ని పులపాలికలకు కట్టబెట్టారు.

Last Updated : Jan 10, 2020, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details